2 September, 2026 | 4:46 AM

మంచు ఫ్యామిలీలో పుట్టకపోయుంటే..

02-09-2026 | 01:03am

నటి మంచు లక్ష్మి(Actress Manchu Lakshmi) తన కుటుంబంపై మాట్లాడిన మాటలు నెటిజన్లను షాక్ గురిచేశాయి. తన తండ్రి మోహన్‌బాబు, సోదరులు విష్ణు, మనోజ్ సినిమాల్లో ఉన్నప్పటికీ, తన ఎదుగుదలకు ఆ కుటుంబ పేరు సహాయపడలేదని, పైగా అది తన కెరీర్‌కు కొంత అడ్డంకిగా మారిందంటూ ఓ కార్యక్రమంలో చేసిన ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

“మేము పితృస్వామ్య కుటుంబానికి చెందినవాళ్లం. ఈరోజు నాకున్న గుర్తింపు కోసం ప్రతీ విషయంలో పోరాడాల్సి వచ్చింది. ఒకవేళ నేను మంచు కుటుంబంలో పుట్టకపోయి ఉంటే, నా సినిమా కెరీర్ ఇప్పుడు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండేది. మా ఇంట్లోని ముగ్గురు పురుషుల ప్రభావం నాపై తీవ్రంగా ఉండేది. అది నాకు రక్షణగా ఉంటూనే మరోవైపు అడ్డంకిగా మారిన కత్తి లాంటిది. నేను ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్న ప్రతిసారీ, ఇంట్లో వాళ్లు ఎందుకు అని ప్రశ్నించేవారు. మంచు అనే ఇంటిపేరును ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది కూడా నేనే.

నాకంటే ముందే విష్ణు, మనోజ్ నటులుగా పరిచయమైనప్పటికీ.. వారు మొదట్లో ఎం.విష్ణువర్ధన్‌బాబు, ఎం.మనోజ్‌కుమార్ అని మాత్రమే పేర్లు పెట్టుకునేవారు. మా నాన్నను కూడా కేవలం మోహన్‌బాబు అనే పిలిచేవారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి మా తాతగారి పేరైన ‘మంచు’ను ఉపయోగించడం ప్రారంభించా. ఆ తర్వాతే విష్ణు, మనోజ్‌తోపాటు అందరూ ఆ ఇంటిపేరును వాడటం మొదలుపెట్టారు” అని తెలిపింది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంచు సంచలన వ్యాఖ్యలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.