కొండా సురేఖ మారని పార్టీ లేదు.. తిట్టని నాయకుడు లేడు
మీ బిడ్డ మాట్లాడితే మీకు బాధ్యత ఉండదా?
కొండా సురేఖ క్షమాపణ చెప్పకపోతే చర్యలు తప్పవు
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యల(Konda Susmitha's comments) వివాదం కొనసాగుతోంది. తన కూతురుతో పాటు మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వ విప్ లు డిమాండ్ చేశారు. శనివారం నాడు విప్ లు ఆదిశ్రీనివాస్, విజయరమణరావు, రామచంద్రనాయక్, ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ నిర్వహించారు. గౌరవనీయమైన పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు.
మీ బిడ్డ మాట్లాడితే మీకు బాధ్యత ఉండదా? అని విప్ విజయరమణారావు(Whip Vijayaramana Rao) ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కొండా సురేఖ వివరణతో పార్టీ సంతృప్తి చెందకపోతే పదవి నుంచి తొలగిస్తారని విప్ విజయ రమణారావు స్పష్టం చేశారు. అవసరమైతే ఎలాంటి చర్య తీసుకోవడానికైనా పార్టీ వెనుకాడదని తేల్చిచెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. కొండా సురేఖకు సొంత జిల్లా నాయకులతో కూడా సఖ్యత లేదని ఆరోపించారు. కొండా సురేఖ మారని పార్టీ లేదు.. తిట్టని నాయకుడు లేడని విప్ లు విమర్శించారు. సీఎం వచ్చేలోపు కొండా సురేఖ క్రమశిక్షణాకమిటీని కలిసి ఉంటే తెలంగాణ సమాజం కొంత క్షమించి ఉండేదని విప్ లు పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సూచించారు. కొండా సురేఖ ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.






