27 February, 2026 | 1:10 PM

మధ్యాహ్న భోజనంపై కలెక్టర్ ఆగ్రహం

27-02-2026 12:59 AM

సిద్దిపేట రూరల్, ఫిబ్రవరి 26: సిద్దిపేట రూరల్ మండలంలోని ఇర్కోడ్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల, సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బిర్యానీ అన్నం, కూరలు, సాంబారు నాణ్యత సరిగా లేకపోవడంపై వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పాటించకపోవడమే కాకుండా వంటలు రుచిగా, నాణ్యతగా వడ్డించడం లేదని హెచ్చరించారు.

భోజన ప్రక్రియను ఫుడ్ చెకింగ్ టీచర్ పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం బాలికల వసతి గృహాన్ని సందర్శించి భోజన నాణ్యతను పరిశీలించారు. పాలకూర పప్పు పలచగా ఉందని మెరుగుపరచాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి కడుపునిండా భోజనం చేయాలని సూచించారు. డ్రైనేజీ సమస్యపై ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి పరిష్కారం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల పనితీరులో మార్పు లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.