7 May, 2026 | 11:34 PM

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం!

07-05-2026 10:26 PM

పశ్చిమ బెంగాల్‌లో ఉద్భవించిన తాజా రాజకీయ పరిణామాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక కీలకమైన పరీక్షగా పరిణమిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత అధికార బదిలీ సజావుగా జరగడం ప్రజాస్వామ్యానికి ఒక మూలసూత్రం.

అయితే, ఎన్నికల్లో ఓడిపోయినవారు పదవిని వదులుకోకుండా కొనసాగేందుకు ప్రయత్నిస్తే, అది కేవలం రాజకీయ వివాదంగా మిగలకుండా రాజ్యాంగ సంక్షోభంగా మారే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తం గా చర్చకు దారితీస్తున్నాయి. ప్రజల తీర్పు ను గౌరవించాలనే ప్రాథమిక సూత్రం, అధికారం పట్ల రాజకీయ ఆకాంక్షల మధ్య ఉత్పన్నమయ్యే సంఘర్షణ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.

భారత రాజ్యాంగ నిర్మాణాన్ని పరిశీలిస్తే, రాష్ట్ర ప్రభుత్వాల చెల్లుబాటు శాసనసభలో ని సంఖ్యాబలం మీద ఆధారపడి ఉం టుంది. రాజ్యాంగంలోని 164వ అధికరణం ప్రకారం గవర్నర్ ముఖ్యమంత్రిని నియమించినప్పటికీ, మంత్రిమండలి సమష్టిగా శాస నసభకు బాధ్యత వహించాలి. అంటే శాసనసభలో మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం నైతికంగానూ, రాజ్యాంగపరంగానూ అధికారంలో కొనసాగేందుకు అర్హత కోల్పోతుంది. ఈ సందర్భంలో గవర్నర్ పాత్ర రాజ్యాంగ పరిరక్షకుడిగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.

శాసనసభను సమావేశప రిచి విశ్వాస పరీక్ష నిర్వహించడం ద్వారా ప్రభుత్వం మెజారిటీ కలిగి ఉందో, లేదో నిర్ధారించాల్సిన బాధ్యత గవర్నర్‌దే. ఎస్‌ఆర్ బొమ్ము వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ అం శంలో మార్గదర్శకంగా నిలిచింది. ఆ తీర్పు లో మెజారిటీ నిరూపణ గవర్నర్ నివాసం లో కాకుండా శాసనసభలోనే జరగాలని న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది.

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, 1977 నుంచి 2011 వరకు కమ్యూనిస్టుల నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ అప్రతిహతంగా పాలన సాగించింది. వామపక్షాల ఆధిపత్యం ఒక ప్రత్యేక రాజకీయ యుగంగా నిలిచింది. జ్యోతిబసు, బుద్ధదేవ్ భట్టాచార్య నాయకత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వాలు 34 ఏళ్లు నిరంతర పాలన కొనసాగించాయి. భూసంస్కరణలు, గ్రామీణాభి వృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాల్లో వామపక్షాల పాలన గుర్తిం పు పొందింది.

అయితే పారిశ్రామికీకరణలో వెనుకబడటం, ఉపాధి అవకాశాల కొరత, రాజకీయ హింస వంటి అంశాలు కాలక్రమేణా ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఈ అసంతృప్తిని రాజకీయం చేయడంలో మమతాబెనర్జీ కీలకపాత్ర పోషించారు. ఆ సుదీర్ఘ శకాన్ని ముగించి, 2011లో ‘పరివర్తన్’ నినాదంతో మమతా బెనర్జీ అధికార పీఠాన్ని అధిరోహించారు. ‘మా, మాటి-మానుష్’ నినాదంతో ప్రజలను ఆకర్షించి తృణమూల్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు.

ఆ ఎన్నికల్లో 294 స్థానాల్లో 184 స్థానాలు గెలుచుకోవడం ద్వారా వామపక్షాల సుదీర్ఘ పాలనకు ముగింపు పలికారు. తదుపరి 2016, 2021 ఎన్నికల్లో కూడా టీఎంసీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ముఖ్యంగా 2021లో 213 స్థానాలు గెలుచుకోవడం ద్వారా పార్టీ బలాన్ని మరింత పెంచుకుంది. అదే సమయంలో బీజేపీ 77 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిం ది. ఈ దశలో బెంగాల్ రాజకీయాలు ద్వైపాక్షిక పోటీ వైపు మళ్లాయి. 

అయితే 2026 ఎన్నికల ఫలితాలు పూర్తిగా భిన్న దృశ్యాన్ని ప్రతిబింబించాయి. మొత్తం 294 స్థానాల్లో ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్ కారణంగా 293 స్థానాల కు ఫలితాలు వెలువడగా, ప్రభుత్వం ఏర్పా టు చేయడానికి అవసరమైన మెజారిటీ సంఖ్య 148గా నిర్ణయించబడింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించగా, టీఎంసీ కేవలం 80 స్థానాలకు పరిమితమైంది. మిగతా స్థానాలు చిన్న పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు దక్కాయి. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీ యాల్లో గణనీయమైన మార్పును సూచిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రాజీనా మా చేయకపోతే, మొదటగా గవర్నర్ జోక్యం తప్పనిసరి అవుతుంది. శాసనసభను తక్షణమే సమావేశపరిచి విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఆదేశించవచ్చు. ఆ పరీక్షలో ప్రభుత్వం మెజారిటీ నిరూపించలేకపోతే, రాజ్యాంగపరంగా ఆ ప్రభుత్వం కొనసాగలేదు. తదుపరి దశలో గవర్నర్ మెజారిటీ కలిగిన పార్టీ నాయకుడిని ప్రభుత్వం ఏర్పా టు చేయమని ఆహ్వానిస్తారు. ఇక్కడ స్పష్టమైన మెజారిటీ ఉన్న బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇది రాజ్యాంగ ప్రక్రియలో భాగమై న సహజ పరిణామం. అయితే ఈ ప్రక్రియ లో ఆలస్యం లేదా రాజకీయంగా ఆటంకా లు ఏర్పడితే, పరిస్థితి మరింత సంక్లిష్టం అవుతుంది. రాజ్యాంగ యంత్రాంగం సక్రమంగా పనిచేయకపోతే, 356వ అధికరణం ప్రకా రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. గతంలో అనేక రాష్ట్రాల్లో ఈ నిబంధన వినియోగం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా కేంద్ర-, రాష్ట్ర సంబంధాల విషయంలో ఇది ఉద్రిక్తతలకు దారితీసింది. బెంగాల్ వంటి రాజకీయంగా సున్నితమైన రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

రాజకీయపరంగా ఈ పరిణామాలు ప్రజాస్వామ్య విలువలపై గంభీరమైన చర్చకు దారితీస్తాయి. ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నించడం ప్రజల తీర్పును నిరాకరించినట్లే అవుతుంది. ఇది ప్రజల్లో అసహనాన్ని పెంచి నిరసనలు, ఆం దోళనలకు దారితీసే అవకాశం ఉంది. బెం గాల్‌లో గతంలో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు ఈ పరిస్థి తిని మరింత సున్నితంగా మారుస్తాయి. రాజకీయ ఉద్రిక్తతలు సామాజిక శాంతి భద్రతలను దెబ్బతీయవచ్చు.

పరిపాలనాపరంగా ఈ సంక్షోభం ప్రభా వం తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వ యం త్రాంగం స్థంభించిపోవడం, అధికారుల్లో నిర్ణయాలపై అనిశ్చితి పెరగడం, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. పెట్టుబడిదా రుల విశ్వాసం దెబ్బతినడం, పారిశ్రామికరంగం మందగించడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం వంటి ప్రభావాలు కూడా కనిపించవచ్చు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతి కూల ప్రభావాన్ని చూపుతుంది.

న్యాయపరంగా కూడా ఈ అంశం కీలకమవుతుంది. ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా కొనసాగితే, ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంది. గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు తక్షణ ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించింది. అందువల్ల ఇక్కడ కూడా న్యాయవ్యవస్థ జోక్యం తప్పదని భావించవచ్చు. న్యాయవ్యవస్థ జోక్యం రాజ్యాంగ పరిరక్షణకు ఒక భరోసాగా నిలుస్తుంది.

ఇక రాజకీయ వ్యూ హాల కోణంలో చూస్తే, అనుభవజ్ఞురాలైన మమతాబెనర్జీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. స్వతంత్ర ఎమ్మెల్యేలు లేదా చిన్న పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రత్యర్థి పార్టీ భారీ మెజారిటీ సాధించడం వల్ల ఇది సాధ్యసాధ్యాల మధ్య నిలిచే వ్యూహంగా కనిపిస్తోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో ఉన్న పార్టీ మధ్య కొనసాగుతున్న రాజకీయ విభేదాలు ఈ సంక్షోభాన్ని మరిం త క్లిష్టతరం చేస్తాయి. గవర్నర్ పాత్రపై విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఇది సమా ఖ్య వ్యవస్థలో ఉద్రిక్తతలకు దారితీస్తుంది. కేంద్ర-, రాష్ట్ర సంబంధాల సున్నితత్వం ఈ సందర్భంలో స్పష్టంగా బయటపడుతుంది. మొత్తంగా బెంగాల్‌లో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితి ఒక రాష్ట్ర రాజకీయ సమస్య మాత్రమే కాదు; ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక అగ్ని పరీక్ష. ప్రజల తీర్పును గౌరవించడం, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడటం, అధికార బదిలీని సజావుగా నిర్వహించడం ప్రజాస్వామ్యానికి ప్రాథమిక సూత్రాలు.

ఈ సూత్రాలను విస్మరించినప్పుడు ఏర్పడే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో గతంలో జరిగిన పలు ఉదంతాలను చూస్తే తెలుస్తుంది. అంతిమంగా, ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు; అది ప్రజల చేతుల్లో ఉండే తాత్కాలిక బాధ్యత మాత్రమే. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రజల తీర్పును అంగీకరించడం ప్రతి రాజకీయ నాయకుడి కర్తవ్యం. బెంగాల్ ప్రస్తుత పరిణామాలు భవిష్యత్తులో భారత రాజకీయాలకు ఒక మార్గదర్శకంగా నిలిచే అవకాశమున్న ఒక చారిత్రక ఘట్టంగా భావించవచ్చు. 

 వ్యాసకర్త: జర్నలిస్ట్, 9440595494

రామకిష్టయ్య సంగనభట్ల