మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 27,(విజయక్రాంతి): జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసీ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నివారణ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో వ్యక్తుల జీవితాలు దుర్భరమవుతాయని, ముఖ్యంగా యువత వీటి బారిన పడకుండా ముందస్తు అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు.
కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో గంజాయి సరఫరాపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, రవాణా వంటి చర్యలను తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు,ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






