30 May, 2026 | 8:33 PM

బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

30-05-2026 07:15 PM

- సూర్యాపేటలో 'స్నేహ' మాక్ పార్లమెంట్ లో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట,(విజయక్రాంతి): కిశోర బాలికలు ప్రభుత్వం కల్పించే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకాంక్షించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక  99 రోజుల వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 'స్నేహ మాక్ పార్లమెంట్' కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి పాల్గొని మాట్లాడారు. పట్టుదల, వ్యక్తిత్వ వికాసం, మంచి అలవాట్లతోనే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చన్నారు. 

ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన:

ఈ మాక్ పార్లమెంట్‌లో సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల నుండి 15-18 సంవత్సరాల వయస్సు గల 212 మంది కిశోర బాలికలు సభ్యులుగా పాల్గొన్నారు. జక్కలి రూప స్నేహ చంద్ర స్పీకర్‌గా వ్యవహరించిన ఈ సభలో బాలికలు ప్రజాస్వామ్య వ్యవస్థ, నాయకత్వ లక్షణాలు, మరియు సమాజంలోని పలు కీలక సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా కిశోర బాలికల ప్రగతి, సంఘాల స్థితిగతులు, బాలికల భద్రత, రక్షణ మరియు విద్య, బడి మానేసిన బాలికలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, ఓపెన్ స్కూల్ అవకాశాలు, పారిశుధ్యం, ఆరోగ్యం, ఐరన్  మాత్రలు, శానిటరీ నాప్‌కిన్స్ పంపిణీ, రవాణా సౌకర్యాలు, పాఠశాలల్లో మౌలిక వసతులు, 'స్నేహ' సంఘాల బలోపేతం పై చర్చించారు. సభలో బాలికలు తమ గ్రామాలు, పాఠశాలల్లోని సమస్యలను గుర్తించి, ప్రజాప్రతినిధుల తరహాలోనే బాధ్యతలను అర్ధం చేసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అంశాలపై తీర్మానాలు చేశారు. దీంతో ప్రజాపాలన ప్రగతిప్రణాళికలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వారోత్సవాలు ముగిశాయి.