22 April, 2026 | 2:44 AM

నీటి నిల్వ సమస్యలపై దృష్టి సారించాలి

22-04-2026 01:07 AM

క్షేత్రస్థాయిలో బ్లాక్ స్పాట్‌లను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): జిల్లాలోని పలు మండలాల్లో వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల తలెత్తుతున్న సమస్యలను అధికారులు సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల్లోని పలు వరద నీటి నిల్వల బ్లాక్ స్పాట్‌లను ఉన్నతాధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించి, నివారణకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ముందుగా నేరడిగొండ మండలంలోని కిష్టాపూర్ వే బ్రిడ్జి నీ కలెక్టర్ పరిశీలించి, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా, అవసరమైన మార్పులు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడి నుండి ఇచ్చోడ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉన్న కాలువ నిర్మాణాన్ని, గత వర్షాకాలంలో వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతున్నట్లు గుర్తించి, దానికి అవసరమైన పరిష్కార మార్గాలను అధికారులతో చర్చించారు.

అనంతరం గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ గ్రామ పరిధిలో గల ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను అధికారులు తనిఖీ చేసి, హాస్టల్ ఆవరణలోకి నీరు చేరడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ సమస్యకు ప్రధాన కారణమైన డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. కలెక్టర్  వెంట డిపిఓ రమేష్, డిఎల్పిఓ ఫణిందర్, పంచాయతీ రాజ్ ఈ.ఈ శివరాం, ట్రైబర్ ఈ ఈ తనాజీ, జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ అధికారి సునీత, తహసీల్దార్లు కలిమ్, ఇమ్రాన్ ఖాన్, కవిత, ఎంపిడిఓలు రవీందర్, శేఖర్, డిప్యూటీ ఈఈ రాజేష్, కేఎన్‌ఆర్, జాతీయ రహదారి విభాగం  ప్రతినిధులు శాలిని, సుకుమార్, సోమా నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.