04-02-2026 07:12:00 PM
* యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు పూర్తి చేయాలి
* జాతరలో పార్కింగ్ నిర్వహణ పక్కా ప్రణాళికతో చేపట్టాలి
* భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికావద్దు
* సమీక్ష సమావేశంలో కలెక్టర్ రాహుల్ రాజ్
* జాతర పోస్టర్ ఆవిష్కరణ
పాపన్నపేట: మహాశివరాత్రిన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించే మహా జాతర కీర్తిని ఎల్లలు దాటేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మహా జాతర ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సూచించారు. బుధవారం ఏడుపాయల్లోని హరిత హోటల్ లో అదనపు కలెక్టర్ నగేష్, పోలీసు ఉన్నతాధికారులు, ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈనెల 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు వైభవోపేతంగా నిర్వహించనున్న జాతర ఏర్పాట్ల ప్రగతి, పార్కింగ్ ప్రణాళిక తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా పార్కింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భక్తుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఉండడమే జాతర విజయవంతానికి నాంది అని పేర్కొన్నారు.
అధికారులందరూ సమిష్టిగా, సమన్వయంతో ఆ నాలుగు, ఐదు రోజులు కష్టపడి పని చేయాలని సూచించారు. బ్యారీ కేడింగ్ పక్కాగా ఉండాలని, వివిధ శాఖల మధ్య ఉన్న చిన్న సమన్వయ లోపాలను పరిష్కరించుకొని పకడ్బందీగా జాతర నిర్వహించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఆలయంలో భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా క్యూలైన్ నిర్వహించాలని ఆలయ ఈవో వీరేశం, సిబ్బందికి సూచించారు. జాతర సమయంలో కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ప్రతి ఏరియాలో పోలీస్ సిబ్బంది ప్రజలకు రక్షణగా అందుబాటులో ఉండాలని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు.
మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎక్కువ బస్సు సర్వీసులు నడపాలని, జాతరకు ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని సూచించారు. భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు కలక్కుండా ఎక్కడికక్కడ త్రాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ పరిసరంలో అపరిశుభ్రత కాకుండా మూడు షిఫ్ట్ లో పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. జాతర సందర్భంగా వైద్య క్యాంపులు ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యమైన ప్రదేశాలలో అన్ని పందిళ్ళ వద్ద మంటలు ఆర్పే ఫైర్ యంత్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
జాతరను పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అధికారుల నోడల్ ఆఫీసర్ల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, భక్తుల కోసం ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా 2 అగ్నిమాపక వాహనాలు, 1 ద్విచక్ర వాహనం అందుబాటులో ఉంచుతున్నారన్నారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో 150 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా 5 ప్రదేశాలలో క్యాంప్ లు, నాలుగు 108 అంబులెన్సు లు, లక్ష వోఆర్ఎస్ ప్యాకెట్ లు, మందులు, అంత్యవసర మందులు, 28 మంది డాక్టర్లు, 4 డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ, 80 మంది ఆయుష్ డాక్టర్లు, ఏఎన్ఎంలు100, ఇతర వైద్య సిబ్బంది మొత్తం 300 మంది పనిచేస్తారని తెలిపారు.
ఆర్టీసీ ద్వారా ప్రతి రోజు వివిధ రూట్లలో 140 బస్సులు మూడు రోజుల పాటు మొత్తం 420 బస్సులు నడుస్తాయని తెలిపారు. టేకుల గడ్డ బస్టాండ్ నుండి 10 ఉచిత మినీ బస్సులు తిరుగుతాయని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 9 సంచార బృందాలు, 2 చెక్ పోస్టులు, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల సమన్వయంతో 144 నల్లాలు, 45 మంది మానిటరింగ్ చేస్తారని, 400 మంది కార్మికులు, 498 మరుగు దొడ్లు, వాటర్ ట్యాంకర్లు 40, ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పంచాయతీ శాఖ ద్వారా 18 మంది సెక్టార్ అధికారులు,180 మంది పంచాయతీ కార్యదర్శులు, 640 మంది మల్టీ పర్పస్ కార్మికులు, రెండు షిఫ్ట్లలో పని చేయనున్నారని పేర్కొన్నారు. 13 నుంచి 18 వ తేదీ వరకు పనులు చేయనున్నారు. డస్ట్ బిన్స్, బ్లీచింగ్ పౌడర్, పాగింగ్ చేయనున్నారని తెలిపారు.
పోలీసు బందోబస్తు...
జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 04 డీఎస్పీలు, 23 మంది సీఐలు, 80మంది ఎస్సైలు, 45మంది ఏఎస్సైలు, 96మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 250 మంది కానిస్టేబుళ్లు, 84 మంది మహిళా కానిస్టేబుళ్లు, 234 మంది హోంగార్డులు, 14మంది మహిళా హోంగార్డులు మొత్తం 829 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, నాగ్సన్పల్లి సర్పంచ్ సుశీల, తహసిల్దార్ సతీష్ కుమార్, పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.