27 August, 2026 | 8:05 PM

పారదర్శకంగా భూ రీ-సర్వే పనులు

27-08-2026 06:54 PM

ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పూర్తి చేయాలి

నాగల్‌గిద్ద, ఆగస్టు 27 (విజయ క్రాంతి ): నాగల్‌గిద్ద మండల పరిధిలోని కరస్‌గుత్తి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూముల కొలతలు, హద్దుల నిర్ధారణ, భూ వివరాల నమోదు తదితర ప్రక్రియలను స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.రీ-సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో  నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి అభ్యంతరాలు, సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. కొలతలు, హద్దుల నిర్ధారణ సమయంలో భూ యజమానులకు అవసరమైన సమాచారం అందించాలని తెలిపారు.భూముల హద్దులు, విస్తీర్ణం, రికార్డులను పక్కాగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్‌లో భూ వివాదాలకు అవకాశం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులో రీ-సర్వే ప్రక్రియను నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్, సర్వే ల్యాండ్ ఏడీ, నాగల్‌గిద్ద తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి, ఎంపీడీవో మహేశ్వర రావు ఆర్ఐ అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రీ-సర్వే ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు, సర్వే సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.