రానున్న రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ప్రజలకు కలెక్టర్ పలు సూచనలు
భూపాలపల్లి,(విజయక్రాంతి): వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న రెండు రోజులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని, అత్యవసర అవసరాల కోసం వస్తే తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు, చెరువులు, కల్వర్టుల వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కలెక్టరేట్‌లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ప్రజలు 9030632608 హెల్ప్ లైన్ నెంబర్ లో సంప్రదించి ప్రభుత్వ సహాయాన్ని పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాలకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.






