9 July, 2026 | 2:15 AM

నేడు హనుమకొండకు గవర్నర్ రాక ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

09-07-2026 01:34 AM

హనుమకొండ (మహబూబాబాద్) జూలై 8 (విజయక్రాంతి): రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా గురువారం హనుమకొండ పర్యటనకు రానున్నారు. గవర్నర్ తన పర్యటన సందర్భంగా  హనుమకొండలోని పెద్దమ్మగడ్డలో ఉన్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజి ఆఫ్ ఏక్సిలెన్స్ సందర్శించనున్న నేపథ్యంలో కళాశాలలో నిర్వహిస్తున్న ఏర్పాట్లను  జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి, జాయింట్ కలెక్టర్ కె. రవితో కలిసి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా కళాశాలలోని మౌలిక వసతులు, కిచెన్ షెడ్, ప్లే గ్రౌండ్, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్లను పరిశీలించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులను సందర్శించి డిజిటల్ విద్యా విధానంలో ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై వారితో ఆత్మీయంగా మాట్లాడారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల పఠన సామర్థ్యం, అభ్యాస నైపుణ్యాలను స్వయంగా పరిశీలించి, పలు ప్రశ్నలు అడిగి వారి అవగాహనను తెలుసుకున్నారు.

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు. గవర్నర్ పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సత్వరమే పూర్తి చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ నందనూరి పద్మినితో పాటు సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగసాగర్, ఆర్డీవో వెంకటేష్, ట్రైనీ కలెక్టర్ రోహిత్, జీడబ్ల్యూఎంసీ అధికారులు సీఎంహెచ్ ఓ రాజారెడ్డి, ఎం హెచ్ ఓ రాజేష్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్, కళాశాల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.