యాప్ ద్వారా రైతులకు పారదర్శకంగా యూరియా సరఫరా
చింతకాని మండలంలోని ఎరువుల గోడౌన్లు, విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ దివాకర టీఎస్
ఖమ్మం, జూన్ 30 (విజయక్రాంతి): జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల గోడౌన్లలో, సేల్ పాయింట్లలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షణ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాకు 18832.34 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకోగా, పాత నిల్వలను కలుపుకొని 24903.7 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో వచ్చిందన్నారు.
ఇప్పటి వరకు 6071.13 మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకం అయినట్లు కలెక్టర్ అన్నారు. మంగళవారం చింతకాని మండలం లోని నాగులవంచ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎరువుల గిడ్డంగులు, విక్రయ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను పరిశీలించి, స్టాక్ వివరాల రిజిస్టర్‌లో పొందుపరచిన వాటికి అనుగు ణంగా నిల్వలు అందుబాటులో ఉన్నాయా లేదా అని పరిశీలించారు.
ఇప్పటివరకు ఎన్ని ఎరువుల బస్తాలు వచ్చాయి, ఎన్ని పంపిణీ చేశారు, ఇంకనూ ఎంత పరిమాణంలో నిల్వలు రావాల్సి ఉంది తదితర వివరాలను వ్యవసాయశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. యూరియా బుకింగ్ యాప్ పనితీరును కలెక్టర్ స్వయంగా రైతుల మొబైల్ పోన్ లో పరిశీలన చేసి యాప్ వల్ల సమకూరే ప్రయోజనా లను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, వానాకాలం సీజన్ పంటల సాగుకు అవసరమైన మేరకు పూర్తి స్థాయిలో ఎరువుల నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, యూరియ లభ్యతపై రైతులు ఆందోళనకు గురి కావద్దని సూచించారు.
రైతులను నానో యూరియా కొనాలని డీలర్లు, బలవంతం చేయవద్దని, వారు కోరిన ఎరువులు మాత్రమే అందించాలని, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రైతులు పంటల అవసరంమేరకు మాత్రమే మోతాదుకు మించకుండా ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించే విధంగా, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా సహకార శాఖ అధికారి గంగాధర్, చింతకాని మండల తహసీల్దార్ కిలారి బాబ్జీ, ఎంపీడీవో శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






