ట్రంప్‌నకు భారీ షాక్
- జన్మతః పౌరసత్వ రద్దు ఉత్తర్వుల కొట్టివేత
- అమెరికా సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
- 63 మెజార్టీతో రద్దు చేసిన అత్యున్నత న్యాయస్థానం
- సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు వరుసగా రెండో ఎదురుదెబ్బ
- గతంలో గ్లోబల్ సుంకాలను రద్దు చేసిన సుప్రీం కోర్టు
వాషింగ్టన్, జూన్ ౩౦: అమెరికా సుప్రీం కోర్టు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్‌నిచ్చింది. వలస విధానాల సంస్కరణల్లో ట్రంప్ తీసుకున్న జన్మతః పౌరసత్వ (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్) రద్దు నిర్ణయాన్ని మంగళవారం సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఆ వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను రద్దు చేసింది. దేశ రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం దేశంలో జన్మించే ప్రతి బిడ్డకూ పౌరసత్వం పొందే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ చారిత్రాత్మక తీర్పు అమెరికా వలస విధానాలపై, లక్షలాది వలసదారుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గతేడాది జనవరిలో ట్రంప్ రెండోసారి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ట్రంప్ జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేశారు.
తద్వారా దేశవ్యాప్తంగా అక్రమంగా వలసదారులు లేదా తాత్కాలిక వీసాలపై ఉన్న విదేశీయుల పిల్లలకు అమెరికా పౌరసత్వాన్ని నిరాకరించడం ఈ ఆర్డర్ ప్రధాన ఉద్దేశం. తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరుడు లేదా శాశ్వత నివాసి (గ్రీన్‌కార్డ్‌దారు) అయి ఉంటేనే వారి పిల్లలకు పౌరసత్వం ఇవ్వాలని ట్రంప్ భావించారు. ఈ క్రమంలో ఆ ఆర్డర్ వివాదాస్పదమైంది. రద్దు ఉత్తర్వులు సరికాదంటూ సుప్రీం కోర్టులో పెద్దఎత్తున పిటిషన్లు దాఖలయ్యాయి.
వాటిపై తాజాగా తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం 6-3 మెజారిటీతో ఆర్డర్ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ మాట్లాడుతూ.. పౌరసత్వ నిబంధనను మార్చే అధికారం దేశాధ్యక్షుడికి లేదని తేల్చిచెప్పారు. రాజ్యాంగ నిర్మాతలు దేశంలో జన్మించిన ప్రతి బిడ్డకు పౌరసత్వం ఇవ్వాలని భావించారని, వారి ఆశయాన్ని అత్యున్నత న్యాయస్థానం కాపాడి తీరుతుందని స్పష్టం చేశారు.
ఆర్డర్ అమలులోకి వచ్చి ఉంటే ఏటా అమెరికాలో పుట్టే దాదాపు 2,50000 మంది పిల్లలపై ప్రభావం పడేదని, లక్షలాది కుటుంబాలు తమ శిశువుల పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు ఇబ్బంది పడేవారని తెలిపారు. మరోవైపు, కేసు విచారణకు స్వయంగా ట్రంప్ స్వయంగా హాజరు కావడం విశేషం. ఆ దేశ చరిత్రలో ఒక దేశ అధ్యక్షుడు సుప్రీంకోర్టు మౌఖిక వాదనలకు వ్యక్తిగతంగా హాజరుకావడం ఇదే మొదటిసారి. ట్రంప్‌నకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడం ఇది రెండోసారి. అంతకుముందు ఫిబ్రవరిలో గ్లోబల్ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు కొట్టిపడేసిన సంగతి తెలిసిందే.






