1 July, 2026 | 1:29 AM

అగ్నిపర్వతం నుంచి పసిడి ధూళి

01-07-2026 12:47 AM
  1. ఏడాదికి గాలిలోకి రూ.౧౮.౯ కోట్ల విలువైన బంగారం
  2. రోజుకు ౮౦ గ్రాముల చొప్పున విడుదల
  3. అంటార్కిటికాలోని ‘ఎరెబస్’ వద్ద అద్భుతం
  4. మూడు దశాబ్దాలుగా మిస్టరీగానే రహస్యం 

రాస్, జూన్ ౩౦: అంటార్కిటికా ఖండంలోని ఎరెబస్ అగ్నిపర్వతం నుంచి బంగారు ధూళి వెలువడుతున్నది. కొంత లావాతో పాటు ప్రతిరోజూ అగ్నిపర్వతం బంగారు ధూళినీ విడుదల చేస్తున్నది. ఇది భూమి దక్షిణం ధ్రువంలో ఉన్న ఏకైక అగ్నిపర్వతం. రాస్ ద్వీపంలోని ఈ పర్వతం ప్రస్తుతం రోజుకు 80 గ్రాముల బంగారు ధూళిని.. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రోజుకు రూ.5.6 లక్షల విలువైన బంగారాన్ని వెదజల్లుతుందన్నమాట. ఈ అద్భుతాన్ని చూసి శాస్త్రవేత్తలు సైతం అబ్బురపడుతున్నారు.

మంగళవారం వరకు అగ్నిపర్వతం నుంచి సంవత్సరానికి రూ.౧౮.౯ కోట్ల విలువైన బంగారు ధూళి వెలువడుతుదని స్పష్టం చేస్తున్నారు. ఈ ధూళి కింద పడాలంటే, అంతకుముందు సుమారు వెయ్యి కిలోమీటర్లునా ప్రయాణం చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌లో పరిశీలించగా ఒక్కో బంగారు ధూళి కణం 60 మైక్రోమీటర్ల వరకు వ్యాసం ఉండి, స్ఫటిక రూపంలో ఉందని చెబుతున్నారు. పర్వత విస్ఫోటనం వల్ల లావా ఎగసిపడుతుందే కానీ, బంగారు ధూళి వెలువడటం అసాధారణ విషయమని ఘంటాపథంగా వెల్లడిస్తున్నారు.

ఇంతకుముందు హవాయిలోని కిలావుయా, ఇటలీలోని మౌంట్ ఎట్నా, అలాస్కాలోని ఆగస్టీన్, మెక్సికోలోని ఎల్ చిచోన్ వంటి అగ్నిపర్వతాల నుంచి కొంత మొత్తంలో బంగారు ధూళి వెలువడిందని కానీ, ఇంత పెద్ద మొత్తంలో బంగారు ధూళి వెలువడటం మొదటిసారి ఎరెబస్ అగ్నిపర్వతం నుంచేనని తేల్చిచెప్పారు. అగ్నిపర్వతం నుంచి వెలువడే క్లోరిన్, సల్ఫర్ సమ్మేళనాలు కలిసి బంగారు ధూళి ఏర్పడుతుందని, ఆ ధూళి చల్లారిన తర్వాత స్ఫటికాలుగా ఏర్పడుతున్నాయని వివరించారు. అయితే.. ఏ శాస్త్రవేత్త కూడా ఇప్పటివరకు అధికారికంగా, ఫలానా రసాయనిక చర్య వల్ల అగ్నిపర్వతం నుంచి బంగారు ధూళి ఏర్పడుతుందని ఇతమిత్థంగా, శాస్త్రీయంగా నిరూపించలేకపోవడం గమనార్హం.