రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం దిలావార్ పూర్ టోల్ ప్లాజా, లోకేశ్వరం మండలంలోని పలు రైస్ మిల్లులను ఆయన స్వయంగా సందర్శించి ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మిల్లులకు చేరుకున్న లారీలను 24 గంటల్లోపు తప్పనిసరిగా అన్‌లోడింగ్ పూర్తి చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కటింగ్‌లు, అక్రమ కోతలు అనుమతించబోమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హమాలీల కొరత ఉన్న ప్రాంతాల్లో వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ధాన్యం దిగుమతిలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే పీపీసీలు, రవాణా విభాగం, రైస్ మిల్లుల మధ్య సమన్వయం కొనసాగించాలని ఆదేశించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని త్వరితగతిన అన్‌లోడింగ్ చేసి వారికి ఇబ్బందులు కలగకుండా చూడటం అధికారుల బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, సివిల్ సప్లై అధికారులు రాజేందర్, సుధాకర్, తహసీల్దార్ సూర్యరావ్ తదితరులు పాల్గొన్నారు.






