3 July, 2026 | 9:17 PM

Breaking News

వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •  

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

03-07-2026 08:17 PM

- ఏర్పాట్లపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

కల్వకుర్తి ఊరుకొండ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని ఉర్కొండపేట శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తెలిపారు. శుక్రవారం  జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ముఖ్యమంత్రి భద్రతా విభాగం ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

హెలిప్యాడ్, ఆలయ ప్రాంగణం, ముఖ్యమంత్రి సభా వేదిక, ప్రజల రాకపోకల మార్గాలు, వాహనాల పార్కింగ్ స్థలాలు, కాన్వాయ్ ప్రయాణ మార్గం, భద్రతా పాయింట్లను స్వయంగా తనిఖీ చేసి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి భద్రతా విభాగం ఆధ్వర్యంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్  సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని శాఖల వారీగా సమీక్షించారు. ముఖ్యమంత్రి ప్రయాణ మార్గం నుంచి కార్యక్రమం ముగిసే వరకు అమలు చేయాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర సేవలు, వైద్య బృందాల మోహరింపు, అగ్నిమాపక సన్నద్ధత, విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుద్ధ్యం, కమ్యూనికేషన్ వ్యవస్థ, ప్రజా రద్దీ నియంత్రణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి భద్రతా విభాగం తరఫున అదనపు ఎస్పీ చి. వాసుదేవ రెడ్డి, డీఎస్పీలు ఎ. శ్రీధర్ రెడ్డి, డి. కృష్ణ ఏఎస్‌ఎల్‌లో పాల్గొని స్థానిక యంత్రాంగంతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ప్రణాళికను అమలు చేసే విధానంపై సంబంధిత అధికారులకు పలు సూచనలు అందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అరుణా రెడ్డి, దేవ సహాయం, కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, విద్యుత్, పంచాయతీరాజ్, రోడ్లు-భవనాలు, ఆర్ అండ్ బీ, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు, ఆలయ ఈవోతో పాటు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.