3 June, 2026 | 4:18 AM

అంతరాష్ట్ర దొంగను పట్టుకున్న నగర సీసీఎస్ పోలీసులు

03-06-2026 01:49 AM

బంజారాహిల్స్,జూన్ 2( విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 180కి పైగా చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగను హైదరాబాద్ సిటీ డీడీ సీసీఎస్ ప్రత్యేక క్రైమ్ టీమ్ ఎట్టకేలకు అరెస్ట్ చేసింది.విశ్వసనీయ సమాచారం మేరకు పక్కా ప్లాన్తో రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితుడిని మురాద్ నగర్, ఆసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజల్ షా అలీ జబ్రీ (43) అలియాస్ అబ్దుల్లాగా పోలీసులు గుర్తించారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం అత్యంత ప్రమాదకరమైన ఈ పాత నేరస్థుడిపై గతంలో కోర్టుల ద్వారా జారీ అయిన 14 నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. 2023వ సంవత్సరంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైఫాబాద్, మొగల్పురా, చార్మినార్, నాంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా బంగారు గొలుసుల దొంగతనాలకు పాల్పడిన అనంతరం ఇతను పరారయ్యాడు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి మొదట బెంగళూరుకు పారిపోయిన నిందితుడు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయచోటికి మకాం మార్చాడు. అక్కడ నివసిస్తూనే రాయచోటి, చేనూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో మూడు చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

హైదరాబాద్ సిటీ డీడీ డీసీపీ ఎస్. చైతన్య కుమార్ సమగ్ర మార్గదర్శకత్వంలో సీసీఎస్ ప్రత్యేక క్రైమ్ టీమ్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు, వారి సిబ్బంది ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత సాహసోపేతంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించి సుదీర్ఘ కాలంగా మోస్ట్ వాంటెడ్గా ఉన్న ఈ అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్న ప్రత్యేక క్రైమ్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.