27 July, 2026 | 10:27 PM

మంచినీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన

27-07-2026 09:52 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగర ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలను కల్పించే దిశగా నగరపాలక సంస్థ మరో కీలక అడుగు వేసింది. నగరపాలక సంస్థ 19వ డివిజన్ రేకుర్తి ప్రాంతంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టనున్న మంచినీటి పైపులైన్ పనులకు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ తో కలిసి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్  మాట్లాడుతూ... వేగంగా విస్తరిస్తున్న నగర అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైపులైన్లు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ సుదగోని మాధవి కృష్ణ, కార్పొరేటర్లు పర్వతం మల్లేశం, గుగ్గిళ్ల జయశ్రీ, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.