27 July, 2026 | 10:27 PM

రోగులకు మెరుగైన వైద్యo అందించాలి

27-07-2026 09:44 PM

రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రన్ని ఆకస్మిక తనిఖీ: జిల్లా కలెక్టర్ అంకిత్

లక్ష్మీదేవి పల్లి,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం,రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి,అధికారులకు పలు సూచనలు చేశారు. తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలోని ప్రతి వార్డును సందర్శించి పరిశుభ్రత, పారిశుద్ధ నిర్వహణ, రోగుల సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ, వార్డులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని, రోగులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదవుతున్న ఓపీ  వివరాలు, రోజువారీ రోగుల సంఖ్య, గత పది రోజులుగా నమోదైన జ్వర కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జ్వరాలపై ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని, జ్వర లక్షణాలతో వచ్చే ప్రతి రోగికి అవసరమైన పరీక్షలు నిర్వహించి తక్షణమే చికిత్స అందించాలని సూచించారు. అంటువ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, రక్త పరీక్షల విభాగాన్ని సందర్శించిన కలెక్టర్ మలేరియా, డెంగ్యూ, హెచ్‌ఐవీ నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్ కిట్ల లభ్యత, నిర్వహిస్తున్న రక్త పరీక్షల వివరాలను తెలుసుకున్నారు.

ప్రయోగశాలలో అవసరమైన అన్ని పరీక్షా సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి వైద్యులు, సిబ్బంది విధుల్లో ఉన్నారా లేదా అని తనిఖీ చేశారు. విధి నిర్వహణలో సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మందుల నిల్వలు, వాటి గడువు తేదీల ను పరిశీలించారు.  మందుల కొరత ఏర్పడకుండా ముందస్తుగా ఇండెంట్లు పంపించి అవసరమైన మందులను నిల్వ ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా పాము కాటుకు గురైన బాధితులకు అత్యవసరంగా వినియోగించే, యాంటీ స్నేక్ వెనం ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని  ఆయుష్ వైద్య సేవలను కూడా సమర్థవంతంగా అందించాలని సూచించారు. రోగులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది స్పందనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట లక్ష్మీదేవి పల్లి తాసిల్దార్ శిరీష, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, వైద్యులు సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.