బంగారు కుటుంబాన్ని సృష్టించుకున్నారు
- కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు
- రాష్ట్ర సంపదనంతా దోచుకున్నారు
- అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): కేసీ ర్ పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ పేరు తో ప్రజలను మభ్యపెట్టి, కేవలం తమ బంగారు కుటుంబాన్ని మాత్రమే సృష్టించుకున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి పునాదులైన నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఆకాంక్షను తుంగలో తొక్కి, రాష్ట్ర సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. అమరవీరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు.
స్వరాష్ట్రం కోసం, భావితరాల బాగుకోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి, సమిధులైన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తూ మంగళవారం ఒక ప్రకటనను ఆయన విడుదల చేశారు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల దశాబ్దాల కల, వందలాది మంది యువకుల బలిదానాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో.. పాలకులు గత 12 ఏళ్లలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు.
గత పాలకుల అహంకార, అవినీతి పాలన నుంచి విముక్తి లభిస్తుందని, తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు వస్తుందని నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే.. రెండున్నరేళ్లలో ఆశించిన మార్పు ఎక్కడా కనిపించలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా గాలికొదిలేసి, రాష్ట్రాన్ని కేవలం ఒక రియల్ ఎస్టేట్’ వ్యాపార కేంద్రంగా మార్చేసిందని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, రాష్ట్రాన్ని అవినీతి, దోపిడీ, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చిందన్నారు.
మార్పు వస్తుందని నమ్మితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని ఆరోపించారు. అవినీతి, దోపిడీ బాటలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ భూ దందాలతో దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందన్నారు. అమరవీరులు ఏ ఆశయాల కోసమైతే ప్రాణత్యాగం చేశారో.. ఆ నిజమైన ప్రజాస్వామిక, సామాజిక సమృద్ధివంతమైన తెలంగాణ ఇంకా సాకారం కావాల్సి ఉందన్నారు.
కేవలం ఒక కుటుంబం కోసమో, లేదా కొందరు రాజకీయాల ముసుగులో చేసే వ్యాపారవేత్తల కోసమో తెలంగాణ ఏర్పాటు కాలేదన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కాపాడేందుకు, అమరవీరుల కలలు నిజం చేసేందుకు మనమంతా కలిసికట్టుగా పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు.






