18 August, 2026 | 3:03 AM

బీఆర్‌ఎస్ కోసం పనిచేస్తున్న చిన్నారెడ్డి

18-08-2026 01:19 AM
  1. ఇంటెలిజెన్స్ విచారణ చేయించి, సీఎంకు లేఖ ఇస్తా
  2. వారం రోజుల్లో పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
  3. లేదంటే గాంధీభవన్‌ను ముట్టడిస్తా
  4. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి, ఆగస్టు 17 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేతల కోసం చిన్నారెడ్డి పనిచేస్తున్నాడని, దీనిపై ఇంటెలిజెన్స్ విచారణ చేయించి, సీఎం రేవంత్‌రెడ్డి లేఖ ఇస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు. చిన్నారెడ్డిని వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే గాంధీభవన్‌ను ముట్టడిస్తానని హెచ్చరించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.

గోపాల్‌పేటలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ మరో కార్యాలయం ప్రారంభించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చిందంటూ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం దక్కించుకున్న చిన్నారెడ్డి.. ఈ తొమ్మిదిసార్లు కూడా డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకున్నారా? అని ప్రశ్నించారు. తాను కార్యకర్తల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన దగ్గర ఉన్న డబ్బును కార్యకర్తల కోసం ఖర్చు చేస్తున్నానని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ నేతల కోసం పనిచేస్తున్నది ఎవరు? 

వనపర్తి, పెబ్బేరు, ఘనపూర్, గోపాల్‌పేట ప్రాంతాల్లో కొంతమంది బీఆర్‌ఎస్ నాయకుల కోసం చిన్నారెడ్డి పనిచేస్తున్నారని మేఘారెడ్డి ఆరోపించారు. వారి పనుల కోసం అధికారులకు ఫోన్లు చేయడం, బిల్లులు ఇప్పించడం, వారిని వెంట పెట్టుకుని తిరగడం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ నాయకుల కోసం పనిచేస్తున్న మీరు కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు.

చిన్నారెడ్డి ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నారో తేల్చేందుకు ఇంటెలిజెన్స్ విచారణ చేయించి సీఎంకు లేఖ ఇస్తానన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ, క్రమశిక్షణ కమిటీకి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2014లో చిన్నారెడ్డి.. నిరంజన్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. వనపర్తికి వచ్చి గాడిదలు కాయడానికి వస్తున్నారా? హైదరాబాద్‌లో ఉండండి అని అప్పట్లో చెప్పారని మేఘారెడ్డి పేర్కొన్నారు.

ఇప్పుడు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా.. ఇక్కడ ఎమ్మెల్యే ప్రోటోకాల్‌ను నేను చూసుకుంటా మీరు ఎందుకు వచ్చి జోక్యం చేసుకుంటున్నారు? అని ప్రశ్నించారు. చిన్నారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ సంతకాలు సేకరించామని, వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే గాంధీభవన్‌ను ముట్టడిస్తామని ఎమ్మెల్యే మేఘారెడ్డి హెచ్చరించారు.