అమెరికాను వణికిస్తున్న చిలుకూరి బాలాజీ
సెనేటర్ స్మిత్ వివాదాస్పద పోస్ట్
రంగారెడ్డి, ఆగస్టు 28 (విజయక్రాంతి): సిటీ శివారు మొయినాబాద్ మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ ఆలయం ఇప్పుడు ఏకంగా అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. విదేశీ విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునే వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం దశాబ్దాలుగా వస్తున్న ఆచారం. అయితే, ఈ ఆధ్యాత్మిక విశ్వాసాన్ని లక్ష్యంగా చేసుకుంటూ అమెరికా సెనేటర్ స్మిత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.
అమెరికన్ల ఉపాధి కొల్లగొడుతున్నారు..
సెనేటర్ స్మిత్
సెనేటర్ స్మిత్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా చిలుకూరు ఆలయ దృశ్యాలను, పూజల వీడియోలను రీపోస్ట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భారత్లో వీసాల కోసమే ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. అక్కడికి వచ్చే వేలాది మంది భారతీయులు వీసాలు పొంది, అమెరికాకు వచ్చి స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను, ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారు‘ అని ఆయన ఆరోపించారు. హెచ్-1బీ (H-1B) మరియు విద్యార్థి వీసాల జారీని తక్షణమే సమీక్షించి, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఆయన ప్రతిపాదించారు.
తీవ్ర ఆగ్రహం..
సెనేటర్ వ్యాఖ్యలపై అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐ వర్గాలు, స్థానిక భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీసాలు కేవలం ప్రార్థనలతో మాత్రమే రావని, అభ్యర్థుల ప్రతిభ, అర్హత, అమెరికన్ కంపెనీల సాంకేతిక అవసరాల బట్టే లభిస్తాయని ఐటీ నిపుణులు స్ప ష్టం చేశారు. కోట్ల మంది విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రాన్ని, భక్తుల నమ్మకాలను అమెరికా అంతర్గత రాజకీయాల కోసం వాడుకోవడం శోచనీయమని చిలుకూరు ఆలయ అర్చకులు, స్థానికులు మండిపడ్డారు.అమెరికాలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో స్థానిక ఓటర్లను ఆకట్టుకునేందుకే ఇమ్మిగ్రేషన్ అంశాన్ని, భారతీయ నిపుణులను టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా, హైదరాబాద్లోని ఒక క్షేత్రం పేరు ఏకంగా అమెరికా సెనేట్లో మారుమోగుతుండటం తీవ్ర చర్చనీయాంశమైంది.






