చికిత్స అనంతరం ఆరు నెలల చిన్నారి మృతి.. ఆలేరులో ఉద్రిక్తత
ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో చికిత్స అనంతరం ఆరు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం సింగారం గ్రామానికి చెందిన అనిల్, పద్మ దంపతులకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పద్మ తల్లిగారి ఊరు శారాజిపేట కావడంతో పాపకు జ్వరం రావడంతో మంగళవారం ఆలేరులోని సాయిశ్రీ చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలిపారు.
అక్కడ డాక్టర్ హరి నారాయణ చిన్నారిని పరీక్షించి చికిత్స అందించి మందులు రాసి పంపించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పరిస్థితిలో మార్పు లేకపోతే మళ్లీ ఆసుపత్రికి తీసుకురావాలని సూచించినట్లు తెలిపారు. అనంతరం చిన్నారిని తిరిగి ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స అందించిన తర్వాత ఇంజక్షన్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం పరిస్థితి మెరుగుపడకపోవడంతో జనగామలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు.
దీంతో తల్లిదండ్రులు చిన్నారిని జనగామకు తీసుకెళ్లగా.. అక్కడ వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తీవ్ర విషాదానికి గురైన తల్లిదండ్రులు చిన్నారి మృతదేహంతో ఆలేరుకు తిరిగి వచ్చి సంబంధిత ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
చికిత్సపై కుటుంబ సభ్యుల అనుమానాలు
ఆసుపత్రికి సంబంధించిన మెడికల్ షాప్, ల్యాబ్ టెక్నీషియన్ నాగరాజుపై కూడా స్థానికులు ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో డాక్టర్ అందుబాటులో లేని సమయంలో తానే చికిత్స అందించి మందులు ఇచ్చేవాడని కొందరు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం చిన్నారికి డాక్టర్ స్వయంగా చికిత్స చేశారా? లేక ల్యాబ్ టెక్నీషియన్ చికిత్స చేశారా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.
చిన్నారి మృతికి అసలు కారణం ఏమిటి, చికిత్సలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా అనే విషయాలు పోస్టుమార్టం నివేదిక, వైద్యపరమైన రికార్డులు, సీసీ కెమెరా దృశ్యాలు తదితర ఆధారాల ద్వారా వెలుగులోకి రావాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిసింది. చిన్నారి మృతికి కారణాలపై పోలీసుల దర్యాప్తు పూర్తయితేనే వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.






