సైబర్ ఉచ్చులో చిక్కిన గిరిజనుడు
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఐదు లక్షల రూపాయల లోన్ ఇప్పిస్తామని నమ్మించి గిరిజనుడి నుంచి సైబర్ నేరగాళ్లు దశలవారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన తిర్యాణి మండలం మంగి గీసిగూడ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఆత్రం గంగు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న నేరగాళ్లు ఫోన్ చేసి లోన్ మంజూరైందని, పత్రాల ప్రక్రియ పూర్తయిందని నమ్మించారు.లోన్ పొందాలంటే ముందుగా బీమా రుసుము చెల్లించాలని చెప్పి తొలుత రూ.7,500 వసూలు చేశారు. అనంతరం మరోసారి రూ.16 వేలు, మూడోసారి రూ.10,600 చెల్లించాలని చెప్పి డబ్బులు తీసుకున్నారు.
ఇలా పలుమార్లు డబ్బులు వసూలు చేసిన అనంతరం నేరగాళ్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయినట్లు గంగు గుర్తించాడు.లోన్ వస్తుందనే నమ్మకంతో డబ్బులు చెల్లించిన బాధితుడు ప్రస్తుతం ఆందోళనకు గురవుతున్నాడు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలను నమ్మవద్దని, లోన్ ఇప్పిస్తామని చెప్పేవారికి ముందుగా ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని హెచ్చరిస్తున్నారు. బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారం, రహస్య సంకేతాలు ఇతరులకు తెలియజేయవద్దని సూచిస్తున్నారు.






