8 June, 2026 | 5:08 PM

మానవత్వం చాటిన చెలిమి ఫౌండేషన్

08-06-2026 03:25 PM

బాధిత కుటుంబానికి రూ.40 వేల ఆర్థిక చేయూత

గజ్వేల్, (విజయక్రాంతి): కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ చెలిమి ఫౌండేషన్ మరోసారి తమ మానవత్వాన్ని చాటుకుంది.   సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామానికి చెందిన తూం దేవేందర్ ప్రస్తుతం గజ్వేల్ పట్టణంలో నివాసం ఉంటూ బైక్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. గతంలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెదడులో రక్తం గడ్డకట్టిన సమస్య తలెత్తింది. దీంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

చికిత్సకు భారీగా ఖర్చులు అవుతుండటంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం చెలిమి ఫౌండేషన్ దృష్టికి వచ్చింది. దీనికి స్పందించిన ఫౌండేషన్ సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి సహాయం అందించారు. చెలిమి ఫౌండేషన్ తరఫున రూ.15 వేల ఆర్థిక సహాయం, చెలిమి మిత్రులు సేకరించిన రూ.25 వేల విరాళాలను కలిపి మొత్తం రూ.40 వేల నగదును దేవేందర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఫౌండేషన్ సభ్యులు దేవేందర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చెలిమి ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు గుంటుకు శ్రీనివాస్, యాట ఆంజనేయులు, పెద్దూరి శ్రీనివాస్, మెతుకు నర్సింలు, చేపూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.