మిల్లుల వద్ద వరి ధాన్యం లారీలను వేగంగా అన్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలి
ధాన్యంలో తరుగు పేరిట రైతులను దగా చేస్తే చర్యలు తప్పవు
జనగణన ఎన్యుమరేటర్లు మొదటి మూడు రోజులు క్షేత్రస్థాయిలో హద్దులను తనిఖీ చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): వరి కొనుగోలు కేంద్రాల నుంచి తరలిన ధాన్యం లారీలు మిల్లుల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండకుండా వేగంగా అన్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వరి ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల వద్ద అన్లోడింగ్, జన గణన ప్రక్రియ పలు అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో రబీ సీజన్ సంబంధించిన వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తహసీల్దార్లు, పోలీస్ అధికారులు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో చొరవ తీసుకొని ఎక్కడ ఆటంకాలు లేకుండా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి తరలిన ధాన్యం కేటాయించిన మిల్లుకు చేరిన తర్వాత అక్కడ తరుగు, లేదా ఇతర కారణాల పేరిట రైతులని దగా చేయడానికి వీలులేదని అటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మిల్లులకు తరలిన ధాన్యం వేగంగా అక్కడ అన్లోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లుల వద్ద అన్లోడ్ చేసుకోకుండా అనేక రకాల కారణాలు చూపి లారీలను వేచి ఉండేలా చేస్తే చర్యలు తప్పమన్నారు.
తహసిల్దార్లు, ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి వేగంగా అన్లోడ్ చేయించాలన్నారు. రైతులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తిన ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. లారీ లు మిల్లుల వద్ద ఒక రోజుకు మించి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడవద్దని సూచించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను కూడా అవసరమైనన్ని లారీలను అందుబాటులో ఉంచమని సూచించాలని, ఏ విధమైన సమస్యలు రాకుండా చూడాలని తెలియజేయాలన్నారు. మొత్తంగా, ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యత అని, మిల్లర్లపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించి సజావుగా పూర్తయ్యేలా ముందుకు వెళ్లాలని సూచించారు.
జనగణనలో భాగంగా ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో హద్దులను తనిఖీ చేసుకోవాలి
జనగణన 2027 లో భాగంగా మే 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న క్షేత్రస్థాయి హౌస్ లిస్టింగ్ ప్రక్రియ నిర్వహించడానికి వెళ్తున్న ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఐడి కార్డు మరియు జనగణన సామాగ్రి తప్పనిసరిగా అందజేయాలని చార్జ్ ఆఫీసర్లకు కలెక్టర్ సూచించారు. వారి హాజరు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. ఎన్యుమరేటర్లు మొదటి రెండు మూడు రోజుల్లో తమకు కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ ల హద్దుల్ని తనిఖీ చేసుకునేలా వారికి తెలియజేయాలనీ సూచించారు. హెచ్ఎల్బీల హద్దుల్ని ఈ మూడు రోజుల్లో తనిఖీ చేసుకొని హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ కు సిద్ధం కావాలన్నారు.
ఈ సారి డిజిటల్ పద్దతిలో జనగనన చేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని తెలిపారు. జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎన్యుమరేటర్లు కొంచెం ఉదయం వేళల్లోనే క్షేత్ర స్థాయిలో పర్యటించేలా చూడాలని, ఎవరూ వాడ దెబ్బ బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని ఆదేశించారు. ఓ ఆర్ ఎస్ కిట్ అందుబాటులో ఉంచాలని ఛార్జ్ ఆఫీసర్స్ కు సూచించారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ , అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, సీపీ ఓ హరికృష్ణ, డి ఆర్ డి ఓ ఉమాదేవి, వీసీ ద్వారా తహసీల్దార్ లు, పోలీస్ అధికారులు, సెన్సస్ ఛార్జ్ అధికారులు, ఇతర అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.






