కంటితడుపుగా జనగణన అవగాహన ర్యాలీ..!
- ఏర్పాట్లలో ప్రణాళిక శాఖ అధికారులు విఫలం.
- టెంట్, మైక్ సెట్, తాగునీరు ఏర్పాటు చేయని అధికారులు
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): జనగణనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన ర్యాలీ కంటితడుపుగా సాగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా సాగింది.
జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు హాజరైనా, కనీస సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలమైనట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ర్యాలీ ప్రారంభ స్థలంలో టెంట్, తాగునీరు ఏర్పాటు చేయక పోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మైక్ సెట్ కూడా ఏర్పాటు చేయక పోవడంతో పలువురు అధికారుల ప్రసంగాలు స్పష్టంగా వినిపించక పోయాయని పాల్గొన్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ప్లకార్డులు, అవగాహన కరపత్రాలు, బ్యానర్లు కూడా ఒక్కటే ప్రదర్శించడం విశేషం. యాభైకి పైగా టోపీలను మాత్రం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అమరేందర్ మాట్లాడుతూ జనగణన దేశ అభివృద్ధికి పునాది వంటిదని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించాలని, ప్రజలు జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాత, డీఈఓ రమేష్ కుమార్, ఇంచార్జి డీఎంహెచ్వో రవి నాయక్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, రెవెన్యూ అధికారులు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






