ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు
పురస్కారాలు అందించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి, మే 17 (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్య విజయోత్సవం వేడుకలను ఆదివారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
విద్యా, క్రీడా రంగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు చెక్కు, ప్రశంసా పత్రం, జ్ఞాపికలను అతిథులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి సంగారెడ్డి జిల్లాకు, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
సమాజ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. నగదు పురస్కారాలు అందుకున్న వారిలో కుమ్మరి మౌనిక, నంపల్లి ధనలక్ష్మి, పెద్దపట్నం ధరణి, ఎ. గాయత్రి, ఎం. అరవింద, బి. నిఖిత, కె. రుత్విక రెడ్డి, ఎం. స్మితక, వి. ప్రియాంక, కమ్మరి పూజ, లక్ష్మి పద్మావతి ఉన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. వెంకటేశ్వర్లు, అదనపు సంచాలకులు శంకర్, సమగ్ర శిక్ష సమన్వయ కర్తలు, మండల విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యా సమన్వయ మండలి కార్యదర్శి లింబాజీ, బాలయ్య, తాజుద్దీన్, భీమగొండ, వెంకటస్వామి, సిద్ధారెడ్డి, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






