ధరలభారంపై ఎమ్మార్వో కార్యాలయం ముట్టడికి పిలుపు
తిరుమలాయపాలెం, మే 27 (విజయక్రాంతి): పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మే 30న తిరుమలాయపాలెం ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) ఖమ్మం జిల్లా నాయకుడు కమ్మకోమటి నాగేశ్వరరావు తెలిపారు.
బుధవారం పిండిప్రోలు గ్రామంలోని రాయల వెంకట్ నారాయణ భవనంలో మీగడ సత్యం అధ్యక్షతన జరిగిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై ధరల భారం మోపుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలపై అదనపు భారాలు పెడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా మే 30న జరిగే ఎమ్మార్వో కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తిమ్మిడి హనుమంతరావు, సోమనపల్లి వెంకటేశ్వర్లు, పునుగుజ్జు వెంకటస్వామి, ఆరంపల్లి వెంకన్న, బానోత్ శంకర్, గోకినపల్లి సరోజన, తుపాకుల నాగేశ్వరరావు, నామ అప్పారావు, రాయిండ్ల చిరంజీవి, దొడ్డ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.






