యువ సంగ్రామ సభ‘కు తరలిరావాలి
18న సరూర్ నగర్‌లో బీఆర్‌ఎస్ బహిరంగ సభ
ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, సబితారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్
ఎల్బీనగర్, జులై 15: నిరుద్యోగులకు మద్దతుగా నిర్వహిస్తున్న ‘యువ సంగ్రామ సభ‘ను విజయవంతం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. జూలై 18న సరూర్నగర్లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘యువ సంగ్రామ సభ‘ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సభా ఏర్పాటులో భాగంగా బుధవారం సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న సభా వేదిక నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, శంభీపూర్ రాజు, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన వేదిక నిర్మాణం, పార్కింగ్ ఏర్పాట్లు, ప్రజల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించి సంబంధిత కమిటీలకు పలు సూచనలు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న యువ సంగ్రామ సభను విజయవంతం చేసి, నిరుద్యోగ యువత గొంతుకను ప్రభుత్వానికి బలంగా వినిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా జూలై 18న సరూర్నగర్ స్టేడియంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘యువ సంగ్రామ సభ‘ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






