23 May, 2026 | 8:36 PM

ప్రాజెక్టుల పేరుతో దొంగ పాదయాత్రలా..?

23-05-2026 07:55 PM

బిజినేపల్లి: బీఆర్‌ఎస్ పార్టీ రెండు పర్యాయాలు అధికారంలో ఉండి కూడా పాలమూరు జిల్లా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు అధికారం కోల్పోయి ఉనికి కోసం పాకులాడుతూ ప్రాజెక్టుల పేరుతో దొంగ పాదయాత్రలకు సిద్ధమవుతోందని జన సమితి జిల్లా అధ్యక్షుడు మొసలి శ్యాంప్రసాద్ ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాలమూరును పట్టించుకోలేదన్నారు.

తమ హయాంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు జిల్లాను పూర్తిగా నష్టపరిచింది కేసిఆర్ ప్రభుత్వమేనన్నారు. జూరాల నుంచి జిల్లా వ్యాప్తంగా నీళ్లు అందించే అవకాశం ఉన్న 72 జీఓను పక్కన పెట్టి, కాంట్రాక్టులు–కమిషన్ల కోసం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రీడిజైన్ చేశారని విమర్శించారు. రెండు సంవత్సరాల్లో కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పూర్తి చేస్తా అని చెప్పిన కేసీఆర్, ఏడు సంవత్సరాలు గడిచినా పనులు పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు అంజి యాదవ్, ఖాదర్ భాషా, ప్రకాష్ గౌడ్, అలంపూర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.