బాధితురాలికి అండగా ఉంటాం
_ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
_ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కల్వకుర్తి: రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఇటువంటి ఘటనలను అరికట్టాల్సిన అవసరం ఉందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. శనివారం కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కల్వకుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో యువకుడు చిత్రహింసలకు గురి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోందని విమర్శించారు. అనంతరం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు చేపట్టిన చర్యల గురించి కల్వకుర్తి డీఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి బాధితురాలికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.






