23 May, 2026 | 9:46 PM

జొన్న పంట కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపడతాం

23-05-2026 08:22 PM

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్,(విజయక్రాంతి): జొన్న పంట కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపడుతామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం బైంసా పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో, జొన్న పంట కొనుగోలు ప్రక్రియపై, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జొన్న, మొక్కజొన్న పంట కొనుగోలు ప్రక్రియను ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తామని అన్నారు. పంట అమ్మకం విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని వివరించారు.

ఇప్పటివరకు ఏర్పాటు చేసిన మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పూర్తి చేసిన మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ, ఇంకా కొనుగోలు చేయాల్సిన మొక్కజొన్న పంట వివరాలను వివరించారు. ఎక్కడ కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. సరిపడినంత మంది హమాలీలు, లారీల ద్వారా కొనుగోలు ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వివరించారు. 

ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, పంటల అమ్మకంలో రైతులకు ఇబ్బందులు కలగకూడదని అన్నారు. పంట కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన పంటల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సరిపడినన్ని లారీలు, హమాలీలతో ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాములకు తరలిస్తూ ఉండాలన్నారు. అధికారులు అంతా క్షేత్రస్థాయిలో పంటల కొనుగోలు విషయంలో పర్యవేక్షణ ఉంచాలని తెలిపారు. భైంసా డివిజన్ మండలాల వారిగా పంటల కొనుగోలు వివరాలను తహసిల్దార్ లను అడిగి తెలుసుకున్నారు.