12 May, 2026 | 6:56 PM

బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ బిఆర్ఎస్ నాయకుల ధర్నా

12-05-2026 06:07 PM

దమ్మపేట,(విజయ క్రాంతి): బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ మందలపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఖమ్మం, రాజమండ్రి  హై వే పై బి ఆర్ ఎస్ శ్రేణులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో ఫోక్సో కేసు నమోదు అయినప్పటికీ నేటి వరకు భగీరథను అరెస్టు చేయక పోవడాన్ని ఖండిస్తూ బి ఆర్ ఎస్ మాజీ మండల అధ్యక్షుడు దొడ్డా రమేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా దొడ్డా రమేష్ మాట్లాడుతూ బండిని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి నుండి సస్పెండ్ చేయాలని, 17 ఏళ్ల బాలికపై ఇంతటి దారుణం జరిగితే మూడు నెలల నుండి బాధితురాలి కుటుంబం ఎఫ్ఐఆర్ నమోదు చేయించడానికి పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, పోక్సో కేసుల్లో పేద ప్రజలకు ఒక న్యాయం, నేతల కుటుంబాలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. బాధితురాలికి అండగా నిలవాల్సింది పోయి, మీ కాంగ్రెస్ పాలనలో బాధిత మైనర్ బాలికపైనే రివర్స్ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.