చట్టానికి సవాల్… అక్రమ నిర్మాణాల వెనుక రాజకీయ అండ?
చట్టం ముందు అందరూ సమానమా... లేక ప్రభావ వంతులకు మినహాయింపా?
బోడుప్పల్‌లో అక్రమాల రాజ్యం… చట్టానికి బహిరంగ సవాల్!
రాజకీయ అండతో రెచ్చిపోతున్న అక్రమ నిర్మాణం!
మాజీ కార్పొరేటర్ బ్యాక్‌డోర్ పవర్… అధికారుల మౌనం!
మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో చెంగిచెర్ల ప్రధాన రహదారి కాంట పక్కన మరోసారి అక్రమ నిర్మాణం వివాదంగా మారింది. అనుమతులకు విరుద్ధంగా అంతస్తులు పెంచుతూ, సెల్లార్ నిర్మాణం చేపడుతున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా, ఓ మాజీ కార్పొరేటర్ అండతోనే ఈ నిర్మాణం సాగుతోందన్న ఆరోపణలు పరిస్థితిని మరింత వివాదాస్పదంగా మార్చాయి. స్థానికుల వాదన ప్రకారం, నిర్మాణదారుల నుంచి డబ్బులు వసూలు చేసి సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనుమతులకంటే ఎక్కువ అంతస్తులు నిర్మించడం మాత్రమే కాకుండా, అనుమతి లేని సెల్లార్ నిర్మాణం కూడా జరుగుతుండటం గమనార్హం. ఇది నిబంధనల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇక, ఈ వ్యవహారంలో మున్సిపల్ అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో “అధికారుల మౌనం వెనుక ఎవరి ఒత్తిడి?” అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చట్టం సామాన్యులకేనా?
సాధారణ ప్రజలు చిన్న నిర్మాణం చేపట్టినా వెంటనే స్పందించే అధికారులు, ఇలాంటి పెద్ద స్థాయి అక్రమాలపై ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. “ప్రభావవంతులకు వేరే నిబంధనలున్నాయా?” అన్న అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయి.
రాజకీయ అండ లేకుండా ఇది సాధ్యమా?
అక్రమ నిర్మాణం ఈ స్థాయిలో కొనసాగడంపై రాజకీయ అండ ఉన్నట్టే అనిపిస్తోందని స్థానికులు భావిస్తున్నారు. “మాజీ కార్పొరేటర్ ప్రభావం… అధికారుల చర్యలను అడ్డుకుంటుందా?” అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది
ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. చట్టాన్ని అమలు చేయాల్సిన వారు చూసే పాత్రలోనే ఉండిపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, అక్రమ నిర్మాణాన్ని ఆపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అనుమతులకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటాం: బోడుప్పల్ డిప్యూటీ కమిషనర్ శైలజ..
బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల ప్రధాన రహదారి వెంట నిర్మితమవుతున్న భవనానికి జి ప్లస్ టు అనుమతులు ఉన్నాయి. అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తు నిర్మించిన సెల్లార్ నిర్మించిన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం.






