24 August, 2026 | 3:43 AM

కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో శ్రావణ సందడి

24-08-2026 01:38 AM

కొమురవెల్లి, ఆగస్ట్ 23: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి  క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. శ్రావణమాసంలో రెండో  ఆదివారం కూడా స్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులకు గంటన్నరకు పైగా సమయం పట్టింది. ఆదివారం ఉదయం నుంచి మల్లన్న క్షేత్రంలో భక్తుల కొలహాలం మొదలైంది. ముందుగాభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి వారి కోనేట్లో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

అనంతరం ముఖ మండపం, గంగిరేణి చెట్టు కింద బోనాలు చెల్లించి, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించిన అనంతరం, భక్తితో తల్లిని వేడుకున్నారు. శ్రావణమాసం కావడంతో మల్లన్న ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా  మారాయి. ఆలయ పార్కింగ్ ప్లేసులు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. భక్తుల రద్దీకి తగ్గట్టు ఆలయ వర్గాలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు.

మల్లన్న స్వామికి భక్తుల విరాళాలు

హైదరాబాద్ కు చెందిన మాసాన్ పల్లి నరసింహారెడ్డి అనే భక్తుడు స్వామివారి ప్రసాదాల తయారీకీ ఉపయోగించే మాడ్రన్ స్టీమ్ బాయిలర్ ను అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన బండారు స్వాతి కిరణ్ లు 50వేల విలువచేసే సీసీ కెమెరాలను విరాళంగా అందజేశారు.