డ్రగ్స్ టెస్టులో దొరికిన బ్రేస్వేల్
కివీస్ క్రికెటర్‌పై నిషేధం
వెల్లింగ్టన్, ఏప్రిల్ 24 : న్యూజిలాండ్ క్రికె ట్‌లో కలకలం రేగింది.. దిగ్గజ పేసర్ డౌగ్ బ్రేస్వేల్ డ్రగ్స్ టెస్టులో పట్టుబడ్డాడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడుతున్న సమయంలో అతడు కోకైన్ తీసుకున్నట్లు తేలింది. దీంతో అతడిపై ఇంగ్లండ్ అండర్ వేల్స్ క్రికెట్ బోర్డు రెండేళ్ల నిషేధం విధించింది. 2025 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో బ్రేస్వెల్ ఎసెక్స్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఈ టోర్నీలో భాగంగా సోమర్సెట్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం సెప్టెంబర్ 24న బ్రేస్వెల్ నమూనాలను సేకరించారు.
లండన్‌లోని వాడా గుర్తింపు పొందిన ల్యాబొరేటరీలో జరిపిన పరీక్షల్లో, అతడు కోకైన్ వాడినట్లు తేలింది. బ్రేస్వెల్ కూడా తను కోకైన్ తీసుకున్నట్లు తన తప్పును అంగీకరించాడు. దీంతో ఎలాంటి విచారణ అవసరం లేకుండానే ఈ కేసును ఈసీబీ ముగించింది. అయితే ఈ నిషేదం గతేడాది నవంబర్ 27 నుంచి అమలులోకి వస్తోంది. అంటే నవంబర్ 23, 2027 వరకు అతడు ఎలాంటి అధికారిక క్రికెట్ పోటీల్లో పాల్గొనలేడు.
35 ఏళ్ల బ్రేస్వెల్.. న్యూజిలాండ్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి చేరిన బ్రేస్వేల్.. తన మూడవ టెస్టులోనే 9 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడు టెస్ట్‌లో 74 వికెట్లు, వన్డేల్లో 26, టీ20ల్లో 20 వికెట్లు తీశాడు.






