ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మకు బోనాలు
* అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన మహిళలు
* శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు
పాపన్నపేట: పాపన్నపేట మండల పరిధిలోని యూసుఫ్ పేట గ్రామంలో శుక్రవారం పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే గ్రామస్తులు అమ్మవారి ఆలయంలో ఓడిబియ్యం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పురోహితుడు రమేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. సాయంత్రం మహిళలు కొత్త కుండలను రంగురంగులతో అందంగా అలంకరించి, వాటిలో పసుపు, కుంకుమ, నైవేద్యంతో సిద్ధం చేసిన బోనాలను తలపై ఎత్తుకొని మంగళహారతులు, డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనం, సాక సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి. గ్రామం చల్లగా చూడాలని, పంటలు బాగా పండాలని, అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, గ్రామస్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






