ఉద్యోగ జీవితంలో ఉద్యోగ విరమణ సహజం
ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి
ఉద్యోగ విరమణ పొందిన పర్సనల్ మేనేజర్ కు ఘన సన్మానం
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఉద్యోగ జీవితంలో ఉద్యోగ విరమణ సహజమని కాని తమ సేవలతో సంస్థలో చెరగని ముద్ర వేసిన అధికారులు ఎప్పటికి గుర్తుండిపోతారని సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సింగరేణి సంస్థలో 37 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు విశేష సేవలు అందించిన పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా సన్మానం నిర్వహించగా జీఎం ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జీఎం మారుతిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ మారుతి పర్సనల్ విభాగంలో పనిచేస్తూ ఉద్యోగుల సంక్షేమం, సేవా సంబంధిత అంశాల సమర్థ నిర్వహణ, కార్మిక, యాజమాన్య సత్సంబంధాల పరిరక్షణ, పారదర్శక పరిపాలన, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విశేష కృషి చేశారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందమయ జీవితం గడపాలని జనరల్ మేనేజర్ ఆకాంక్షించారు.






