31 July, 2026 | 7:32 PM

ఘనంగా ఆషాడ మాస బోనాల జాతర మహోత్సవాలు

31-07-2026 06:58 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): బూడిదగడ్డ బస్తీలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో.. ఆషాడ మాస బోనాల జాతర మహోత్సవాల సందర్భంగా నేడు అమ్మవారి రథోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన డప్పు, డోలు కళాకారుల మేళా తాళాలు,స్థానిక శివసత్తుల పూనకాలు, విచిత్ర వేషధారణలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో కళాకారులు తమ కళా ప్రదర్శనలు నిర్వహించారు. కొద్దిమంది మహిళా భక్తులు అమ్మవారి పూనకాలతో ఊగిపోయారు.

విశేష పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారిని ఆలయ పూజారులు నరేంద్ర భవాని, రాధాకృష్ణ శర్మ, రథం పైకి తీసుకువచ్చారు. డప్పు డోలు మంగళ వాయిద్యాలతో ,శివసత్తుల విన్యాసాలు కళాకారుల విచిత్ర వేషధారణలతో కళాబృందాలతో అమ్మవారి రథోత్సవాన్ని పట్టణంలో అత్యంత వైభవంగా శోభాయ మానంగా నిర్వహించారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ , కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులు, మహిళా భక్తులు రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.