నేరాల దర్యాప్తులో వేగం పెంచాలి
బ్లూకోల్ట్స్, నైట్ పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
మెదక్ జిల్లా ఎస్.పీ డీ.వీ శ్రీనివాస రావు
మెదక్, ఆగస్టు 12 (విజయక్రాంతి): జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టడంతో పాటు కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దర్యాప్తులో ఉన్న పోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షించారు.
ప్రతి కేసును నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. గ్రేవ్ కేసుల్లో శాస్త్రీయ ఆధారాలను సేకరించి, నిందితులకు శిక్షపడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ను పెంచాలని, నేరాల నియంత్రణకు బ్లూకోలట్స్, నైట్ పెట్రోలింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలను జియోట్యాగింగ్ చేయాలని తెలిపారు. రోడ్డు భద్రతలో భాగంగా ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని, ఓవర్లోడ్ వాహనాలపై కూడా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సానుభూతితో వ్యవహరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ సూచించారు. సీసీటియన్‌ఎస్, ఈ-సాక్ష్య, అప్లికేషన్లలో కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డియస్పి లు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, సీఐ లు మహేష్, రేణుక, వెంకట రాజా గౌడ్, సైదా, సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి, రంగా కృష్ణ, ఎసై లు సిబ్బంది పాల్గొన్నారు.






