28 August, 2026 | 9:25 AM

బీసీల మద్దతు ఎటు?

28-08-2026 01:46 AM
  1. సురేఖపై క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో ఆసక్తి
  2. కొండా కుటుంబంపై అసంతృప్తి ప్రభావమేనా?
  3. సురేఖకు అండగా నిలిచేందుకు ముందుకురాని బీసీ వర్గాలు

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): కొండా సురేఖ(Konda Surekha)పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు(Congress Party disciplinary measures) తీసుకునే అవకాశం ఉందన్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. సురేఖ వ్యవహారంలో ఆమెకు బీసీవర్గాల(BC groups) నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని, ఈ అంశాన్ని సామాజిక కోణంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందని భావించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన మేర బీసీ మద్దతు కనిపించడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

దీంతో సురేఖపై చర్యలు తీసుకుంటే బీసీ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయ ఒత్తిడి తీసుకురావాలన్న వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సురేఖపై పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా ఉందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆమెకు మద్దతుగా ఎవరు నిలుస్తారు? కాంగ్రెస్‌లోని బీసీ నేతలు ఏవిధంగా స్పందిస్తారు? సామాజిక వర్గాల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అన్న దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.

అయితే ఇప్పటివరకు బీసీ వర్గాలు ఏకతాటిపైకి వచ్చి సురేఖకు బహిరంగ మద్దతు ప్రకటించే పరిస్థితి కనిపించకపోవడం కొండా కుటుంబానికి రాజకీయంగా ఇబ్బందికర పరిణామంగా మారిందన్న విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రంలో బీసీ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత కీలకంగా మారాయి. జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు, పదవుల్లో వాటా వంటి అంశాలు బీసీ వర్గాల్లో బలమైన రాజకీయ చైతన్యాన్ని తీసుకొస్తున్నాయి.

దీంతో సురేఖపై పార్టీ చర్యలు తీసుకుంటే ఆమె సామాజిక నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ బీసీ వర్గాల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నం జరుగుతుందన్న చర్చ ఉన్నది. అయితే బీసీ వర్గాల స్పందనను కేవలం ఒక నాయకురాలి సామాజిక గుర్తింపుతో నిర్ణయించలేమన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

స్థానికంగా నాయకత్వం ఎలా వ్యవహరించింది? బీసీ నేతలకు ఎంత రాజకీయ ప్రాధాన్యం లభించింది? స్థానికంగా ఎవరి ప్రయోజనాలు ఎలా ప్రభావితమయ్యాయి? అనే అంశాలే చివరకు మద్దతును నిర్ణయిస్తాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.

కొండా కుటుంబంపై అసంతృప్తి

కొండా కుటుంబం విషయంలో కొంతకాలంగా ఉన్న అసంతృప్తి ఇప్పుడు బయటపడుతున్నదన్న చర్చ కూడా వినిపిస్తున్నది. వరంగల్ రాజకీయాల్లో కొండా కుటుంబానికి బలమైన గుర్తింపు ఉన్నప్పటికీ వారి రాజకీయ శైలి పట్ల అన్ని వర్గాల్లో ఒకే రకమైన అభిప్రాయం లేదని, ముఖ్యంగా స్థానికంగా ఎదగాలని చూస్తున్న కొందరు బీసీ నేతలు కుటుంబ ఆధిపత్య రాజకీయాల పట్ల అసంతృప్తితో ఉన్నారన్న వాదనలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో సురేఖపై చర్యల సమయంలో ఆమెకు బీసీ వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు రావడం కష్టమేనన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగతంగా సురేఖతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేతలు స్పందించినా.. దానిని మొత్తం బీసీ సమాజం స్పందనగా మార్చడం అంత సులభం కాదన్న అభిప్రాయం ఉన్నది. సురేఖకు వరంగల్ రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఉన్న ప్రభావం కూడా ఈ వ్యవహారంలో కీలకం.

ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి ప్రకారం.. సురేఖకు వ్యక్తిగతంగా మద్దతు ఉన్నప్పటికీ, ఆమెపై చర్యలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున బీసీ వర్గాలు రాజకీయంగా రంగంలోకి దిగుతాయా? అన్నది అనుమానంగానే ఉన్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సురేఖపై కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? చర్య తీవ్రత ఎంత ఉంటుంది? దానికి సురేఖ, కొండా మురళి ఎలా స్పందిస్తారు? కాంగ్రెస్‌లోని బీసీ నేతలు ఏ వైఖరి తీసుకుంటారు? అన్నదే ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ చర్యలు తీసుకున్న తర్వాత కూడా బీసీ వర్గాల నుంచి పెద్దగా స్పందన రాకపోతే.. కొండా కుటుంబంపై ఉన్న అసంతృప్తికి రాజకీయ సంకేతంగా మారే అవకాశం ఉన్నది. సురేఖకు అనుకూలంగా బీసీ సంఘాలు, నేతలు పెద్ద ఎత్తున స్పందిస్తే మాత్రం ఇప్పటివరకు కనిపించని సామాజిక సమీకరణం ఒక్కసారిగా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది.