6 April, 2026 | 1:34 AM

కొల్లాపూర్‌లో బీజేపీ నేత ఏల్లేని సుధాకర్‌రావు హౌస్ అరెస్ట్

06-04-2026 12:00 AM

కొల్లాపూర్ రూరల్, ఏప్రిల్ 5: కొల్లాపూర్లో బీజేపీ నాయకుడు ఏల్లేని సుధాకర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆదివారం కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యేందుకు వస్తుండగా బొంగరాల మెట్ట వద్ద డీఎస్పీ  శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కొల్లాపూర్ బీజేపీ పార్టీ కార్యాలయానికి తరలించారు.

అనంతరం బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ సోమశిలలో హెలిప్యాడ్ ఏర్పాటు కోసం ప్రైవేట్ వ్యక్తుల ద్వారా పేదల భూములను లాక్కోవడం సరికాదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.54 సర్వే నెంబర్లలో సుమారు 50 ఏళ్ల క్రితం వందలాది మంది రైతులకు లావోని పట్టాలు ఇచ్చారని తెలిపారు. ఆ భూముల విషయంలో ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు రైతులను ఇబ్బంది పెట్టినప్పుడు బీజేపీ పార్టీ అండగా నిలిచిందన్నారు.

రైతుల 120 ఎకరాల భూమిని రక్షించామని చెప్పారు.అభివృద్ధి పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే బీజేపీ పార్టీ ప్రాణత్యాగానికైనా వెనుకాడకుండా పోరాటం చేస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మూలే భరత్ చంద్ర, బీజేపీ మండల అధ్యక్షుడు కేతూరి నారాయణ, టౌన్ అధ్యక్షుడు కాడ శీను, ధనుంజయ్, చిన్నంబాయి మండల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.