మిట్ట ఆంజనేయస్వామి దేవాలయంలో సామూహిక హోమాలు
పెబ్బేరు ఏప్రిల్ 5: పట్టణంలోని శ్రీ మిట్ట ఆంజనేయస్వామి దేవాలయంలో జరుగుతున్న ధ్వజస్థంభ, నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు భక్తి పారవశ్యంతో కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించిన సామూహిక హోమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య 80కు పైగా దంపతులు ఒకేసారి హోమంలో కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే దేవాలయ కమిటీ సభ్యులు భక్తులకు సముచిత ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. రేపు జరగబోయే ప్రతిష్ట మహోత్సవానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి , పట్టణ ప్రముఖులు, హిందూ ధార్మిక నిర్వాహకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.




