ఇసుక అక్రమ రవాణాకు చెక్!
ఆన్ లైన్ ద్వారా ఇసుక బుకింగ్..
ఇసుక వాహనం పేరుతో కొత్త వెబ్ సైట్
మెదక్ జిల్లాలో మూడు ఇసుక పాయింట్లు
మెదక్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకవచ్చింది. ఎక్కడికక్కడ ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. ప్రభుత్వ ఆదాయానికి ప్రధాన వనరుల్లో ఒకటిగా ఉన్న ఇసుక అక్రమ రవాణాను నిలిపివేస్తే పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. జిల్లాలో హల్దీ ప్రాజెక్టు, పెద్ద పెద్ద వాగుల నుంచి వచ్చే ఇసుకను కమర్షియల్ అవసరాలకు విక్రయిస్తుంటారు. ఆ ఇసుకను విక్రయించేందుకు టీఎస్‌ఎండీ ద్వారా ఇసుక రీచులను ఏర్పాటు చేసి ట్రాక్టర్ కు 1173 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు.
అలాగే స్థానికంగా ఉండే వాగులు, చిన్నచిన్న నదుల నుంచి స్థానిక అవసరాల కోసం ‘మన ఇసుక వాహనం’ ద్వారా ఇసుకను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి వే బిల్లులు, అనుమతులు లేకుండా అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా చేసి ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ఇప్పటి వరకు కేవలం గనులు, భూగర్భ శాఖాధికారులు మాత్రమే చర్యలు తీసుకున్నారు. అప్పుడప్పుడు పోలీసుల తనిఖీల్లో పట్టుబడే ఇసుక లారీలు, ట్రాక్టర్లను గనులు, భూగర్భ శాఖకు అప్పగిస్తే వాటికి జరిమానాలు విధిస్తున్నారు. పట్టబ డిన ఇసుకను వేలం ద్వారా విక్రయించే వాళ్లు. కాగా అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా పెట్టేందుకు ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకవచ్చింది.
అధికారులతో పర్యవేక్షణ కమిటీలు..
ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు కొత్త పాలసీ తీసుకవచ్చింది. గురువారం ప్రభుత్వం మెమో నంబర్ 280/ఎం(1)/2026 ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఆర్టీఏ, పంచాయతీరాజ్ అధికారులతో పర్యవేక్షణ బృందాలను ఏర్పా టు చేయాలని పేర్కొన్నారు. ఆయా ఇసుక రీచులకు సమీపంలోని ప్రధాన రహదారులపై చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపట్టాలన్నారు. వచ్చే పోయే లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లను తనిఖీ చేయాల న్నారు. అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయి, వే బిల్లులు ఉన్నాయా, లేదా, వే బిల్లులకు మించి ఇసుకను తీసుకపోతున్నారా, తదితర విషయాలపై ఆరా తీయాల్సి ఉంటుంది.
ఇసుక అక్రమ రవాణా గురించి క్షేత్ర స్థాయిలో ఉండే ప్రజలు సమాచారం ఇచ్చేందుకు వీలుగా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగం కోసం ఒక సెల్ ఏర్పాటు చేయాలని, ఇది 24 గంటల పాటు పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ఇసుక రీచుల నుంచి ఇసుక రవాణా చేసేందుకు కలెక్టర్లు సమయాన్ని నిర్ధేశించాలని పేర్కొన్నారు. రాత్రి వేళలో ఎక్కువగా ఇసుక రవాణా జరగకుండా చూడాలన్నారు. ఇసుక తరలించే వాహనాల వెంబడి వే బిల్లులు ఉన్నాయా, లేదా అని చూడాలన్నారు. ఇసుక వాహనా లను పోలీసు శాఖాధికారులు రెగ్యులర్గా తనిఖీ చేయాలని నిర్ధేశించారు.
మూడు మండలాల్లో ఇసుక..
జిల్లా వ్యాప్తంగా పలు వాగుల్లో ఇసుక లభ్యమవుతున్నా ప్రధానంగా మూడు మండలాల్లో ఇసుక లభ్యత ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రధానంగా మెదక్, హవేలీ ఘనపూర్, కొల్చారం మండలాల్లోనీ వాగులు, వంకల్లో ఇసుక లభిస్తుంది. అయితే ఇప్పటి వరకూ అడ్డూ అదుపు లేకుండా సరఫరా అవుతున్న ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని ప్రవేశ పెట్టింది. ప్రధానంగా ఇందిరమ్మ లబ్ధిదారులు, ప్రైవేట్ గృహాల నిర్మాణం, ఇతర పనుల కోసం వినియోగించే ఇసుక మూడు విభాగాలుగా విభజించారు.
ఇందులో ఆయా అవసరాన్నీ దృష్టిలో ఉంచుకొని ట్రాక్టర్ కు రేట్ ఫిక్స్ చేశారు. అవసరం ఉన్న వారు ఆన్ లైన్ బుకింగ్ చేసుకుంటే అది నేరుగా పంచాయతీ కార్యదర్శి లాగిన్ కు అక్కడి నుంచి తహసిల్దార్ లాగిన్ ఆ తర్వాత శాండ్ రిచ్ ఆఫీసర్ (ఎస్‌ఆర్ ఓ) కు లాగిన్ అవుతుంది. అక్కడి నుంచి వినియోగదారులు నేరుగా ఇసుకను తీసుకొనే అవకాశం ఉంటుంది.
ఇలావుండగా జిల్లాలో లభించే ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించే వారు. మెదక్ జిల్లా నుంచి హైదరాబాద్, కామా రెడ్డి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకునే వారు. ఈ అక్రమ ఇసుక వ్యాపారానికి పోలీసులు, రెవెన్యూ అధికారులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నట్టు సమాచారం. జిల్లాలోని ఆయా గ్రామాల్లో ప్రజా ప్రతినిధులే వారి అనుచరులను పెట్టి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారన్నే ఆరోపణలు ఉన్నాయి.




