calender_icon.png 18 February, 2026 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయ శక్తి

18-02-2026 01:32:08 AM

మున్సిపల్ ఫలితాలతో పార్టీకి అనుకూల వాతావరణం

బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు అందరూ కృషిచేయాలి: బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీజేపీ ఒక శక్తిగా ఎదుగుతోందని, ఆ విశ్వాసాన్ని కార్యకర్తలు ప్రజల్లో బలంగా నాటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందన్నారు. ఇందులో కార్యకర్తల కృషి ఎంతగానో ఉందన్నారు.

‘తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నా యం’ అనే విశ్వాసాన్ని నిలబెట్టిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పండిట్ దీన్ దయా ళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్- రాష్ట్రస్థాయి కార్యశాల మంగళవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం లో రాంచందర్ రావు అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశంలో పోలింగ్ బూత్ స్థాయినుంచి జాతీయ స్థాయివరకు ప్రతి కార్యకర్తకు శిక్షణ అందించే అతి పెద్ద రాజకీయ శిక్షణ కార్యక్రమంతోపాటు, పార్టీ సిద్ధాంతాలపై నాయకులు, కార్యకర్తలకు లోతైన అవగాహన కల్పించారు. దీంతోపాటు ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అలాగే, సైద్ధాంతిక సాధికారతను పెంపొందిస్తూ సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికలను రాంచందర్ రావు వివరించారు. 

మున్సిపల్ ఎన్నికల్లో విజయం కేవలం ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి అనుకూలమైన రాజకీయ వాతావరణాన్ని నిర్మించడంలో మన కార్యకర్తలు సాధించి న విజయమన్నారు. ప్రజల్లోనే కాదు, కార్యకర్తల్లో కూడా ‘తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం’ అనే విశ్వాసం బలపడింద న్నారు. తెలంగాణలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు స్పష్టమైన నిదర్శనమన్నారు.

ఈ ఎన్నికల ఫలితాల్లో చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ వంటి కీలక పదవులన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలను సాధించడం గర్వకారణమన్నారు. నారాయణపేటలో చైర్ పర్సన్ పదవిని సాధించిన బీజేపీ నాయకులు ఎంతో కష్టపడి ఆ బాధ్యతను గెలుచుకున్నారన్నారు. ఇక దేశమంతా దష్టి సారించిన భైంసాలో ఇన్నాళ్లు ‘ఇది మా గడ్డ’ అని చెప్పుకున్న వారి అహంకారాన్ని బద్దలుకొట్టి, భారతీయ జనతా పార్టీ అక్కడ విజయపతాకాన్ని ఎగరవేయడం చారిత్రాత్మక విజయమన్నారు. ఆ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. 

ప్రపంచంలోనే పెద్ద రాజకీయ పార్టీ..

ఇటు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని, దాదాపు 14 కోట్ల సభ్యత్వంతో పార్టీ విస్తృతమైన బలాన్ని సంపాదించిందని, కానీ ఇది కేవలం 14 కోట్ల సభ్యత్వం మాత్రమే కాదు.. మన అసలైన బలం కార్యకర్తలన్నారు. బూత్ స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు, రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి వరకు.. పార్టీలో ప్రతి ఎన్నిక, ప్రతి ప్రక్రియ పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరుగుతుందని పేర్కొన్నారు.

ఇతర పార్టీలను చూస్తే అవి ఎక్కువగా కుటుంబ పార్టీలుగా ఉన్నాయని, వారికి స్పష్టమైన సిద్ధాంతాలు ఉండవని విమర్శించారు. వారికి కేవలం అధికారం సాధించడమే ఏకైక ధేయమని తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత భారతీయ జనసంఘ్‌గా ప్రారంభమైన ప్రయాణం, ఎన్నో అవరోధాలను దాటుతూ, త్యాగాలతో ముందుకు సాగిందని పేర్కొన్నారు.

1980లో భారతీయ జనతా పార్టీగా ఏర్పడిన తరువాత కూడా, కేరళ వంటి రాష్ట్రాల్లో పార్టీ స్థితి అత్యంత కఠినంగా ఉండేదని, ఆ కాలంలో కమ్యూనిస్టులు పాలించిన కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు జరిగినా కూడా, పార్టీ తన సిద్ధాంతాన్ని, దేశభక్తిని ఎప్పటికీ వదల్లేదని చెప్పారు. అలాంటి త్యాగాల పునాదిపైనే నేడు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ శిక్షణ మహాభియాన్ ఉద్దేశం..

ప్రతి కార్యకర్తను సిద్ధాంతపరంగా దృఢంగా తయారు చేయడం, రాబోయే ఎన్నికలకు సంస్థాగతంగా సిద్ధం కావడం, అలాగే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం జరగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యశాలలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్ గౌతంరావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు అమర్‌నాథ్ సారంగుల, రాష్ట్ర పదాధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రభారీలు పాల్గొన్నారు.