పట్టాభూమి ఆక్రమించి..దౌర్జన్యం!
- ప్రభుత్వ నక్ష బాట సైతం కబ్జా
- దరఖాస్తు చేయడానికి వెళ్లితే తహసీల్దార్ చిందులు
- జీపీఓ సైతం ఏకపక్ష ధోరణి.. బెదిరింపులు
- న్యాయం కోసం వృద్ధుల కన్నీరుమున్నీరు
- సిద్దిపేట జిల్లా వెల్దండిపల్లిలో ఘటన
కోహెడ, జూలై3: వృద్ధ దంపతులకు చెందిన వ్యవసాయ భూమిని ఆగ్రకులానికి చెందిన పలువురు దైర్జన్యంగా ఆక్రమించారని, -ప్రభుత్వ నక్ష బాటను సైతం కబ్జా చేశారని, దరఖాస్తు ఇవ్వడానికి వెళ్లిన తమపై తహసీల్దార్ చిర్రుబుర్రులాడారని వృద్ధదంపతులు కంటతడిపెట్టారు. ‘మా భూమి విషయంలో జీపీఓ సైతం ఏకపక్ష ధోరణిగా వ్యవహరిస్తున్నారు.
మమ్ములను బెదిరిస్తున్నారు’ అని తమ గోడును తహసీల్దార్ కార్యాలం ఎదుట శుక్రవారం వెల్ల బోసుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కోహెడ గ్రామ పంచాయతీ పరిధిలోని వెల్దండిపల్లిలో చోటుచేసుకుంది. కోహెడకు చెందిన వృద్ధ దంపతులు వెల్దండి నర్సింగం(88), వెల్దండి పద్మలత(83) మాట్లాడుతూ.. సర్వె నంబర్ 70-71లో గల తమ పట్టా వ్యవసాయ భూమికి కూలీల ద్వారా ఖడ్డీలతో కంచె ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ క్రమంలో కోహెడకు చెందిన బైరవేని సంపత్‌రావు, వింజపల్లికి చెందిన విశ్వనాథం రాజయ్య అడ్డుకున్నారని, కూలీలు నాటిన కడ్డీల కంచెను దౌర్జన్యంగా ధ్వంసం చేశారని తెలిపారు. సమీపంలోని సర్వెనం.77లో వింజపల్లి పొలమారుకు గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రకారం నక్షత్రోవ ఉందని.. అట్టి త్రోవను కూడా కోహెడకు చెందిన రైతులు పేర్యాల రాజేశ్వరావు, బైరవేని సంపత్‌రావు, మంద వీరయ్య తదితరులు ధర్జాగా కబ్జా చేసి వ్యవసాయం చేసుకుంటున్నట్లు ఆరోపించారు.
మంద వీరయ్య ఆక్రమించిన నక్షత్రోవను వదిలిపెట్టి, తమ పట్టాభూమి నుంచి త్రోవచేసి నడుస్తామని రాజేశ్వర్‌రావు, సంపత్‌రావు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ చేసి న్యాయం చేయాలని తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని ఇచ్చేందుకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిరీక్షించారు.
కార్యాలయానికి వచ్చిన తహసీల్దార్ నవీన్ కుమార్‌కు వినతి పత్రాన్ని అందిస్తే.. ఆయన ఒక్కసారిగా ఆగ్రహావేశానికి లోనై తమపై చిందులు వేశారని, తీవ్ర అసహనం వ్యక్తం చేశారని తెలిపారు. ఆ తర్వాత దరఖాస్తు తీసుకున్నారని వృద్ధులిద్దరూ కంటతడి పెట్టారు. ముందురోజు కూడా జీపీఓ తమకు ఫోన్ చేసి ఏకపక్ష ధోరణితో తమను బెదిరించినట్లు చెప్పారు.
పారదర్శకంగా సర్వే చేసి, న్యాయం చేయాలని.. ఉన్నతాధికారులను వేడు కున్నారు. కాగా ప్రభుత్వ నక్షత్రోవ కబ్జాపై స్పందించాల్సిన రెవెన్యూ అధికారులు ఏకపక్ష ధోరణితో మాట్లాడటం ఆంతర్యం ఏందని? పలువురు చర్చిస్తున్నారు. కాగా ఈ విషయంపై తహసీల్దార్‌ను ఫోన్‌లో సంప్రదించగా.. స్పందించలేదు.






