వైద్య కళాశాల, జీజీహెచ్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం
ఈనెల 17న నర్సింగ్ కళాశాల, హాస్టల్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి
మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, సెప్టెంబర్ 2: జిల్లాలో వైద్య, ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నర్సింగ్ కళాశాలల్లో అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలను కల్పించి ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) అధికారులను ఆదేశించారు.
బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కళాశాల, సంగారెడ్డి, జోగిపేట నర్సింగ్ కళాశాలలు, ఆర్‌అండ్బీ, నీటిపారుదల శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, అవసరమైన పరికరాలు, నిర్వహణ, పెండింగ్ పనులు, భవిష్యత్ అవసరాలపై సమగ్రంగా సమీక్షించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, గరల్స్, బాయ్స్ హాస్టళ్లలో అవసరమైన సౌకర్యాలు, పరికరాలు, చేపట్టాల్సిన అదనపు పనులపై కళాశాల ప్రిన్సిపాల్ను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఈనెల 17న స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం...
ఈ నెల 17న సంగారెడ్డి నర్సింగ్ కళాశాల, నర్సింగ్ హాస్టల్, మెడికల్ కళాశాల స్పోరట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవితో జిల్లాలో పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పీహెచ్సీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తదితర వైద్య సంస్థలపై మంత్రి సమీక్షించారు. ఆయా ఆసుపత్రుల్లో మిగిలిన చిన్నచిన్న పనులు, పరికరాల ఏర్పాటు, సిబ్బంది, ఇతర అవసరాలను వెంటనే పూర్తి చేసి ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
సింగూరు కాలువల లైనింగ్ పనులపై సమీక్ష...
నీటిపారుదల శాఖ అధికారులతో సింగూర్ ప్రాజెక్టు పరిధిలోని కాలువల లైనింగ్ పనులు, కట్ట మరమ్మతులు, ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్ఫ్లో, డెడ్ స్టోరేజ్, సగటు నీటిమట్టం, నీటి నిల్వ సామర్థ్యం, పూర్తయిన పనులు, ఇంకా అవసరమైన నిధులపై మంత్రి సమగ్రంగా సమీక్షించారు. కాలువల లైనింగ్, కట్ట మరమ్మత్తు పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నీటిపారుదల శాఖకు సంబంధించిన ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి సంరక్షించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి, జీజీహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, మెడికల్ , నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఆర్‌అండ్బీ, నీటిపారుదల శాఖల అధికారులు, సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






