26 మాల ఉపకులాలకు రెండు రోస్టర్ పాయింట్లు ఇవ్వాలి
- నాలుగు నెలల్లో సమస్య పరిష్కరించాలి..
- లేకుంటే ‘మాలల యుద్ధభేరి’: మాల సంఘాల జేఏసీ
ముషీరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): గ్రూప్-3లోని 26 మాల ఉపకులాలకు 20లోపు రెండు రోస్టర్ పాయింట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్ (Demand of Telangana State Mala Associations JAC) చేసింది. జీవో నంబర్ 99ను రద్దు చేసి రోస్టర్ విధానాన్ని సవరించాలని కోరింది. నాలుగు నెలల్లో సమస్య పరిష్కరించకపోతే డిసెంబరులో లక్షలాది మందితో ‘చలో హైదరాబాద్‌మాలల యుద్ధభేరి’ నిర్వహిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.
లకిడికాపూల్లోని అంబేద్కర్ రిసోర్స్ సెంటర్లో బుధవారం జరిగిన సమావేశంలో జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ (బాలన్న), గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్ లు నిర్ణయాలను వెల్లడించారు. 33 జిల్లాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు..
ఈ నెల 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాల ప్రజాప్రతినిధులు రోస్టర్ సమస్యను బలంగా ప్రస్తావించాలని కోరారు. స్పందించని ప్రజాప్రతినిధుల ఇళ్ల ఎదుట ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వర్కింగ్ చైర్మన్ మంత్రి నరసింహయ్య, మాల విద్యార్థి జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్రావు, ఓయూ ఏఎంఎస్‌ఏ అధ్యక్షుడు నామ సైదులు తదితరులు పాల్గొన్నారు.






