ఫీజు రీయింబర్స్‌మెంట్ పై బీజేపీ ధర్నా
- ఉద్రిక్తంగా మారిన జెడ్పీ సెంటర్ ఆందోళన.
- పోలీసుల ఈడ్చివేత, నెల్లూరి కోటేశ్వరరావు సహా నేతల అరెస్ట్.
- విద్యార్థుల భవిష్యత్తుతో సర్కారు చెలగాటం.
- నిధులు ఇవ్వకుంటే మంత్రులను రోడ్లపైనే అడ్డుకుంటాం.
- బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు.
ఖమ్మం, ఆగస్టు 27(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం జెడ్పీ సెంటర్ వద్ద పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి తోపులాటకు దారితీసింది.
పరిస్థితి అదుపుతప్పడంతో రోడ్డుపై బైఠాయించిన నాయకులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకువెళ్లి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించడంతో ఖమ్మం జెడ్పీ సెంటర్ రణరంగాన్ని తలపించింది. విద్యార్థుల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం అంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో ఎక్కించారు. ఈ అరెస్టుల పర్వంతో ఖమ్మం నగరంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువుల ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా నీరుగారుస్తోందని ఆయన మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సాధన కోసం బీజేపీ గత నెల రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తోందని గుర్తుచేశారు. బకాయిలు పేరుకుపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 లక్షల కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్లుగా కళాశాలలకు కనీస నిర్వహణ నిధులు అందక, విద్యాసంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని స్పష్టం చేశారు. ఫీజులు చెల్లించనిదే విద్యార్థులకు యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో చదువు పూర్తయినా ఉద్యోగాలకు వెళ్లలేక యువత రోడ్డున పడుతోందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
పాలిటెక్నిక్ కళాశాలలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకుందామనుకున్న నాయకులను నిజాం కాలం నాటి తరహాలో గృహనిర్బంధాలు చేయడం, అక్రమంగా అరెస్టులు చేయడం ఈ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. పాలకులు తమ స్వలాభం కోసం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే కళ్లు తెరిచి పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను సైతం రోడ్ల మీద తిరగనివ్వబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
పరిపాలన చేతకాకపోతే తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థి లోకం కన్నెర్రజేస్తే కాంగ్రెస్ సర్కారు ఆ యువత ఆగ్రహ జ్వాలల్లో కాలిపోక తప్పదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అండ ఉన్న రాష్ట్రాల్లోనే ప్రజలు సుఖసంతోషాలతో, అభివృద్ధి పథంలో పయనిస్తున్నారని, తెలంగాణలోనూ ఆ మార్పు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోటేశ్వరరావు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో శ్యామ్ రాథోడ్, నున్న రవి కుమార్ , అల్లిక అంజయ్య, కొణతం లక్ష్మీనారాయణ, నకిరేకంటి వీరభద్రం, శ్రీరామనేని మణి , మంద సరస్వతి ,శాసనాలు సాయిరాం, పమ్మీ అనిత, ఆర్ వి ఎస్ యాదవ్, రుద్ర గాని మాధవ్ బి.కొండ శ్యామ్, శ్రీ లక్ష్మీ రెడ్డి, ఫణి కుమారి, స్వర్ణ, భద్రం , గోనెల శివ తదితరులు పాల్గొన్నారు.






